తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోషల్‌ మీడియాకు ఇక కొత్త నియమావళి - prakash javedkar announcement on guidelines

సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీచేసింది. వీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వీలుగా కొత్తగా నిబంధనలను అమల్లోకి తెస్తున్నట్లు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్‌ వ్యవహారాలశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావ‌డేకర్‌ సంయుక్త ప్రకటన చేశారు. ఇకమీదట అన్ని వ్యవస్థలూ స్వీయనియంత్రణ పాటిస్తూనే, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటుచేసుకోవాలని స్పష్టంచేశారు.

Govt's guidelines for social media platforms
సోషల్‌ మీడియాకు ఇక కొత్త నియమావళి

By

Published : Feb 25, 2021, 8:38 PM IST

Updated : Feb 25, 2021, 11:29 PM IST

సామాజిక మాధ్యమాల్లో చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు కేంద్రం ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సామాజిక మాధ్యమాలకు కొత్త నియమావళిని రూపొందించినట్లు వెల్లడించింది. వీటి ప్రకారం, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారానికి కారణమయ్యే వ్యక్తి వివరాలు కేంద్రానికి వెల్లడించడం, ఫిర్యాదులను సాధ్యమైనంత తొందరగా పరిష్కారించే నిబంధలను తీసుకొచ్చింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్‌ను సునిశితంగా పరిశీలిస్తున్నామని, తాజాగా వాటికి సంబంధించి నూతన మార్గదర్శకాలను విడుదల చేశామని కేంద్రమంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, జావడేకర్‌ సంయుక్త ప్రకటన చేశారు.

సోషల్‌ మీడియాకు ఇక కొత్త నియమావళి
సోషల్‌ మీడియాకు ఇక కొత్త నియమావళి

ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, సామాజిక మాధ్యమ సంస్థలు తప్పనిసరిగా ఫిర్యాదు స్వీకరణ వ్యవస్థను రూపొందించుకోవాలి. ఇందులో ఫిర్యాదుల పరిష్కార ముఖ్య అధికారి, మరో నోడల్‌ అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. యూజర్లు చేసే ఫిర్యాదులను 24గంటలపాటు స్వీకరించే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. పరిష్కార అధికారిగా నియమితమైన వారు భారత్‌లో నివసించే విధంగా చర్యలు తీసుకోవాలి. మహిళలకు సంబంధించి అసభ్యకరమైన, మార్పిడి చేసిన ఫొటోలపై వచ్చే ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని తాజా మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

సోషల్‌ మీడియా దుర్వినియోగం, విద్వేష ప్రసంగాలను నివారించేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు ఈ నిబంధనలు రూపొందించామని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. వీటిపై విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం తాజా మార్గదర్శకాలను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అయితే, సామాజిక మాధ్యమ సంస్థలు భారత్‌లో వాణిజ్యం చేసుకునేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ స్పష్టంచేశారు.

సామాజిక మాధ్యమాలపై నియంత్రణ ఉండాలనే విషయంపై భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ మధ్యే విద్వేష ప్రసంగాలు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారంటూ వెయ్యికి పైగా ఖాతాలను తొలగించాలని భారత ప్రభుత్వం ట్విట్టర్‌ను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై తొలుత వెనక్కి తగ్గని ట్విట్టర్‌, చివరకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై కేంద్రం నూతన మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

సుప్రీం తీర్పు ఇలా..

చిన్నారుల అశ్లీలం, అత్యాచార ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోల ప్రసారానికి సంబంధించి సామాజిక మాధ్యమాలకు తగిన మార్గదర్శకాలు జారీచేయాలని ప్రాంజ్వలా కేసులో 2018 డిసెంబర్‌ 11న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో పాటు సాధ్యమైనంత త్వరగా సామాజిక మాధ్యమాలకు మార్గదర్శకాలు నిర్దేశించాలని 2019 సెప్టెంబర్‌ 24న ఐటీ, ఎలక్ట్రానిక్‌శాఖకు ఆదేశించింది.

ఫేక్‌న్యూస్ (తప్పుడు వార్తలు), సామాజిక మాధ్యమాల దుర్వినియోగం గురించి 2018 జులై 24న రాజ్యసభలో సావధాన తీర్మానంపై చర్చ జరిగింది. 2020 ఫిబ్రవరి 3న రాజ్యసభ కమిటీ సమర్పించిన నివేదికలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అశ్లీల, విద్వేష సమాచారంపై ఆందోళన వ్యక్తంచేసింది.

కోర్టుల ఆర్డర్లు, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్‌ను దృష్టిలో ఉంచుకొని విస్తృత సంప్రదింపులు జరిపి 2018 డిసెంబర్‌ 24న దీనిపై ఇది వరకే ముసాయిదా విడుదల చేసినట్లు మంత్రులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ముసాయిదాకు 171 సూచనలు, 80 ప్రతిసూచనలు వచ్చాయని, అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సామాజిక మాధ్యమాలకు మార్గదర్శకాలు రూపొందించినట్లు కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి:బ్యాలెన్స్​ తప్పిన దీదీ స్కూటర్​!

Last Updated : Feb 25, 2021, 11:29 PM IST

ABOUT THE AUTHOR

...view details