రైతులు-కేంద్రం మధ్య జరిగిన 11వ విడత చర్చల్లోనూ సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. 5 గంటలు పాటు సాగిన సమావేశంలో.. కనీసం తదుపరి చర్చలు ఎప్పుడనే విషయం కూడా ఖరారు కాలేదు.
చర్చలు ఎలా సాగాయి?
శుక్రవారం ఉదయం దిల్లీలో విజ్ఞాన్ భవన్కు చేరుకున్న ఇరు వర్గాలు.. దాదాపు 5 గంటల పాటు చర్చలు జరిపాయి. అయితే ఇందులో కేవలం 30 నిమిషాలే ముఖాముఖిగా చర్చలు ఉండటం గమనార్హం.
సమావేశం ప్రారంభంలోనే ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్నట్లు కరాఖండిగా చెప్పారు అన్నదాతలు. అయితే తమ ప్రతిపాదనలపై పునరాలోచించాలని అన్నదాతలను కోరారు మంత్రులు.
అనంతరం మధ్యాహ్న భోజనానికి వెళ్లారు. ఎప్పటిలాగే ఈసారి కూడా రైతులు వారి భోజనాన్ని వారే ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమయంలో రైతులు, మంత్రులు వేర్వేరుగా చర్చించుకున్నారు.
రెండేళ్లకు పెంచుతామన్నా..
లంచ్ తర్వాత మరో ప్రతిపాదనతో అన్నదాతల ముందుకు వచ్చారు మంత్రులు. సాగు చట్టాల నిలిపివేత సమయాన్ని రెండేళ్లకు పెంచుతామన్నారు. దీనికి కూడా కర్షకులు ఒప్పుకోలేదు. మూడు వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేసి, కనీస మద్దతు ధరకు హామీ ఇవ్వాలని తేల్చిచెప్పారు.
మరోసారి చర్చకు సిద్ధం
రైతులకు సాధ్యమైనన్ని అవకాశాలు ఇచ్చామని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. సాగు చట్టాలను కొద్ది కాలం వరకు నిలిపివేయాలన్న తమ ప్రతిపాదనపై రైతులు అంతర్గతంగా చర్చించుకుని శనివారం కేంద్రానికి తెలిపాలని కోరారు. అన్నదాతలు తమ నిర్ణయాన్ని తెలియజేస్తే మళ్లీ చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
ఈ నేపథ్యంలో మరోదఫా చర్చలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై స్పష్టత రాలేదు.
'ఉద్యమం పవిత్రత కోల్పోయింది: తోమర్
11వ దఫా చర్చల అనంతరం మీడియాతో మట్లాడిన తోమర్.. కొన్ని శక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల ఆందోళన కొనసాగాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు. అందుకే సమస్యకు పరిష్కారం లభించడం లేదన్న ఆయన.. అన్నదాతల ఉద్యమం పవిత్రతను కోల్పోయిందన్నారు.
టాక్టర్ ర్యాలీ యథాతథం
ప్రభుత్వ ప్రతిపాదనలు తమకు అనుకూలంగా లేవన్న రైతు సంఘాలు.. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని తేల్చి చెప్పాయి. తమ ప్రణాళిక ప్రకారం ఈ నెల 26న(గణతంత్ర దినోత్సవం) ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశాయి. శాంతి భద్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పాయి.
ఇదీ చూడండి:గణతంత్ర వేడుకల్లో 'సీఆర్పీఎఫ్' గ్యాడ్జెట్స్ ప్రదర్శన