తెలంగాణ

telangana

By

Published : Oct 13, 2021, 9:03 PM IST

ETV Bharat / bharat

బ్రిటన్‌ పౌరులకు క్వారంటైన్‌ నిబంధన.. వెనక్కి తీసుకున్న భారత్‌

బ్రిటన్​ పౌరులపై భారత ప్రభుత్వం గతంలో విధించిన క్వారంటైన్​ ఆంక్షలను ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.

Govt withdraws travel advisory that added Covid checks
బ్రిటన్‌ పౌరులకు క్వారంటైన్‌ నిబంధన

విదేశీ ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనల విషయంలో భారత్‌, బ్రిటన్‌ మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. కొవిషీల్డ్‌ టీకా రెండు డోసులు వేసుకుని తమ దేశానికి వచ్చే భారతీయులకు క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు బ్రిటన్‌ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో భారత ప్రభుత్వం కూడా ఆ దేశ పౌరులపై విధించిన క్వారంటైన్ ఆంక్షలను ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ నేడు ఓ ప్రకటన విడుదల చేసింది.

అసలేం జరిగిందంటే..

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ టీకాకు గుర్తింపునివ్వడానికి బ్రిటన్‌ తొలుత నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్‌ విమర్శలు గుప్పించడంతో.. కొవిషీల్డ్‌ను గుర్తింపు పొందిన వ్యాక్సిన్ల జాబితాలో చేర్చిన యూకే.. క్వారంటైన్‌ నిబంధనల నుంచి మాత్రం భారతీయులకు మినహాయింపు ఇవ్వలేదు. కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నప్పటికీ తమ దేశానికి వచ్చే భారతీయులు 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

ఈ విషయంపై రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. బ్రిటన్‌ చర్యకు ప్రతిచర్య చేపట్టిన భారత్‌.. ఆ దేశానికి గట్టి ఝలకే ఇచ్చింది. వ్యాక్సిన్‌ తీసుకున్నా.. తీసుకోకపోయినా.. భారత్‌లో అడుగుపెట్టే బ్రిటన్‌ పౌరులంతా 10 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు యూకే ప్రయాణికులకు ప్రయాణ మార్గదర్శకాలను సవరిస్తూ అక్టోబరు 1న ఆదేశాలు జారీ చేసింది.

దీంతో కంగుతిన్న బ్రిటన్‌ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులు కొవిషీల్డ్‌ రెండు డోసులు వేసుకుంటే క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదంటూ వెంటనే ప్రకటన జారీ చేసింది. అక్టోబరు 11 నుంచి నూతన నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీంతో భారత్‌ శాంతించింది. యూకే ప్రయాణికులకు క్వారంటైన్‌ తప్పనిసరి చేస్తూ అక్టోబరు 1న విడుదల చేసిన మార్గదర్శకాలను ఉపసంహరించుకుంటున్నట్లు బుధవారం వెల్లడించింది. అంతర్జాతీయ ప్రయాణికులపై ఈ ఏడాది ఫిబ్రవరి 17న జారీ చేసిన మార్గదర్శకాలే యూకే పౌరులకు కూడా వర్తిస్తాయని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details