govt warns against fake jobs : విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామనే వ్యక్తులు, సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారతీయ యువతకు సూచించింది. విదేశాలకు ఉద్యోగాలకు వెళ్లేవారు సంబంధిత దేశానికి చెందిన నియామక సంస్థలు, వ్యక్తుల వివరాలను పరిశీలించి ధ్రువీకరించుకోవాలని స్పష్టం చేసింది. ఉద్యోగాలపై ఆశతో కొందరు భారతీయులు మయన్మార్ వెళ్లి అక్కడ మోసపోయిన నేపథ్యంలో నకిలీ జాబ్ రాకెట్ వలలో చిక్కుకోవద్దని హెచ్చరిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ శనివారం ప్రకటన జారీ చేసింది.
"థాయ్‌లాండ్‌లో డిజిటల్ సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ ఉద్యోగాలు అంటూ కొన్ని ఐటీ సంస్థలు రాకెట్ నడిపిస్తున్న ఉదంతాలు ఇటీవల బ్యాంకాక్, మయన్మార్‌లలోని భారత దౌత్య కార్యాలయాల దృష్టికి వచ్చాయి. ఆకర్షణీయమైన జీతాలు ఇస్తామంటూ ఐటీ నైపుణ్యాలున్న యువతే లక్ష్యంగా దుబాయ్, భారత్ ఆధారిత రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇస్తున్నాయి. ఆ సంస్థల వలలో చిక్కిన తరువాత అక్రమంగా దేశం దాటిస్తున్నాయి. ఇలా మోసపోయిన బాధితులు అక్కడ బందీలుగా ఉండాల్సి వస్తోంది" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.