తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేదలకు కేంద్రం గుడ్​న్యూస్.. ఏడాది పాటు ఫ్రీ రేషన్

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి వచ్చే ప్రజలందరికీ ఏడాదిపాటు ఉచితంగా రేషన్‌ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇందుకు ఏడాదికి అయ్యే దాదాపు రూ.2 లక్షల కోట్ల భారాన్ని కేంద్రమే భరించనుందని కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

govt provide free ration
ఏడాదిపాటు ఉచిత రేషన్‌

By

Published : Dec 24, 2022, 7:11 AM IST

Updated : Dec 24, 2022, 9:12 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో శుక్రవారం సమావేశమైన కేంద్రమంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకొంది. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద దేశంలోని 81.35 కోట్ల మంది పేదలకు ఏడాదిపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించాలని నిర్ణయించింది. ఇందుకు రూ.2 లక్షల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఇప్పటి వరకు ఎన్‌ఎఫ్‌సీఏ ప్రకారం.. రాయితీ ధరల్లో, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన(పీఎంజీకేఏవై) కింద ఉచితంగా బియ్యం, గోధుమలు అందిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ రెండు పథకాలను విలీనం చేసి అంత్యోదయ అన్నయోజన కిందికి వచ్చే కుటుంబాలకు నెలకు 35 కిలోల చొప్పున, మిగతా వారికి నెలకు తలసరి 5 కిలోల చొప్పున ఉచితంగా వీటిని ఇవ్వాలని నిర్ణయించింది. దీనివల్ల పడే రూ.2లక్షల కోట్ల ఆహార సబ్సిడీ భారాన్ని పూర్తిగా కేంద్రమే భరించాలని తీర్మానించినట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

"జాతీయ ఆహార భద్రత చట్టం కింద పంపిణీ చేసే బియ్యంపై కిలోకు రూ.3, గోధుమలపై రూ.2, చిరుధాన్యాలపై రూ.1 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ మొత్తాలను వసూలు చేయకుండా ఆహారధాన్యాలను పేదలకు పూర్తి ఉచితంగా అందించాలని ప్రధాన మంత్రి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 81.35 కోట్ల మంది పేదలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటి వరకు రాయితీ ధరల్లో కొనుగోలుచేసే వారికి ఇకమీదట పూర్తిగా ఉచితంగా అందుతాయి. ఇదివరకు 35 కిలోల తిండిగింజలు లభించేవారికి ఇప్పుడు కూడా అంతే అందుతుంది. మిగిలినవారికి తలసరి 5 కిలోల చొప్పున లభిస్తాయి. 2023 డిసెంబరు వరకు ఈ పథకం అమల్లో ఉంటుంది" అని పీయూష్‌ గోయల్‌ చెప్పారు.

ఇదివరకు కొవిడ్‌ కాలంలో పేదల ఆర్థిక స్థితిగతులు దెబ్బతిన్నందున పీఎంజీకేఏవై కింద తిండిగింజలు ఉచితంగా అందించేవారని, ఇప్పుడు ఆర్థిక పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ వారికి ఉపశమనం కలిగించడానికి ఆహారభద్రత చట్టం కింద సబ్సిడీ ధరల్లో ఇచ్చే గింజలనే ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన అందులోకే విలీనం అవుతుందన్నారు.

Last Updated : Dec 24, 2022, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details