తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొవిషీల్డ్‌'కు ముందుగా మనదేశంలోనే అనుమతి!

ఆక్స్​ఫర్డ్​ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా టీకా 'కొవిషీల్డ్​'కు తొలుత మన దేశంలోనే అనుమతి లభించే అవకాశాలున్నట్టు సమాచారం. యూకేలో ఈ వ్యాక్సిన్​ అనుమతి పొందేవరకూ వేచిచూడాల్సిన అవసరం లేదని విశ్వసనీయ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతి అనంతరం.. కొవిషీల్డ్ డోసులు అందించేందుకు సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సన్నద్ధమవుతోంది.

Govt starts contest for strengthening digital network platform for COVID-19 vaccine distribution
'కొవిషీల్డ్‌'కు ముందుగా మనదేశంలోనే అనుమతి!

By

Published : Dec 24, 2020, 7:14 AM IST

ఆస్ట్రజెనెకా- ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 టీకా 'కొవిషీల్డ్‌'కు యూకే కంటే ముందుగా మనదేశంలో అనుమతి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టీకా తయారీ- పంపిణీకి సంబంధించి, మనదేశానికి చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ఆస్త్రజెనెకాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే దేశీయంగా ఈ టీకాపై క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తూ, అత్యవసర వినియోగ అనుమతి కోసం సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ), డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) కు దరఖాస్తు చేసింది. క్లినికల్‌ పరీక్షల సమాచారాన్ని కూడా డీసీజీఐకు అందజేసింది. ఈ సమాచారం సంతృప్తికరంగా ఉన్న పక్షంలో 'కొవిషీల్డ్‌'కు అనుమతి లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

యూకేలో ఈ వ్యాక్సిన్​కు అనుమతి వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పనిలేదని, దాంతో నిమిత్తం లేకుండా మనదేశంలో అనుమతి రావచ్చని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి. అనుమతి వచ్చిన వెంటనే ప్రభుత్వానికి 'కొవిషీల్డ్‌' డోసులు అందించడానికి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సిద్ధపడుతోందని, ఎన్ని డోసులు తీసుకోవాలనే అంశాన్ని ప్రభుత్వం త్వరలో నిర్ణయిస్తుందని అంటున్నారు. మరోపక్క యూకే ప్రభుత్వం కూడా ఆస్ట్రజెనెకా- ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన టీకాకు అత్యవసర అనుమతి ఇచ్చేందుకు సిద్ధపడుతోంది.

ప్లాట్‌ఫామ్‌ బలోపేతానికి పోటీ

దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ పంపిణీకి వినియోగించనున్న డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ 'కొవిన్‌' బలోపేతానికి టెక్నాలజీ పోటీని ప్రభుత్వం ప్రకటించింది. ఐటీ కంపెనీలు, అంకుర సంస్థలు తగిన సొల్యూషన్లు ఇవ్వాలని ఆహ్వానించింది. ఎలక్ట్రానిక్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌(ఇవిన్‌) వ్యవస్థను అనుసంధానించడం ద్వారా దేశవ్యాప్తంగా శీతల వ్యవస్థల్లో ఉన్న వ్యాక్సిన్‌ నిల్వలు, నిల్వ ఉష్ణోగ్రతల సమాచారాన్ని తెలుసుకునే సౌలభ్యం కలుగుతుంది. ఈ పోటీని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. వ్యాక్సిన్‌ అందజేసిన తర్వాత పోర్టబులిటీ, రవాణా, వరుసల నిర్వహణ, సమాచారం, పర్యవేక్షణకు సాంకేతిక పరిష్కారాల కోసం ఆరోగ్య శాఖ చూస్తోంది. ప్రజలకు వ్యాక్సిన్‌ అందజేయడానికి మొబైల్‌ టెక్నాలజీని వినియోగించనున్నట్లు ఈ నెలారంభంలోనే ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.

ఇదీ చదవండి:దేశీయంగా న్యుమోనియా టీకా- త్వరలో అందుబాటులోకి

ABOUT THE AUTHOR

...view details