భారత సైనిక దళాల రవాణా వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా కీలక ముందడుగు పడింది. వాయుసేన(Indian Air Force) కోసం అధునాతన రవాణా విమానాల(military transport aircraft) కొనుగోలుకు సంబంధించి స్పెయిన్‌కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది రక్షణ శాఖ. రూ.20వేల కోట్లతో కొనుగోలు చేస్తున్న 56 సీ-295 ఎండబ్ల్యూ విమానాల(c 295 mw aircraft) కాంట్రాక్ట్‌పై శుక్రవారం సంతకాలు చేసినట్లు తెలిపింది. ఈ విమానాలు.. ప్రస్తుతం వాయుసేనలో సేవలందిస్తున్న అవ్రో-748 విమానాలను భర్తీ చేయనున్నాయి. ఈ సీ-295 ఎండబ్ల్యూ విమానం 5-10 టన్నుల బరువులను మోసుకెళ్లగలదు.
సుదీర్ఘం కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ విమానాల కొనుగోలుకు రెండు వారాల క్రితమే ఆమోదం తెలిపింది భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ. ఒప్పందంపై ట్వీట్ చేశారు రక్షణ శాఖ ప్రతినిధి ఏ భరత్ భూషణ్ బాబు.
"భారత రక్షణ శాఖ, స్పెయిన్‌కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ మధ్య 56 సీ-295 రవాణా విమానాల కొనుగోలు కాంట్రాక్టుపై సంతకాలు పూర్తయ్యాయి. "
- ఏ భరత్ భూషణ్ బాబు, రక్షణ శాఖ ప్రతినిధి