ఉద్యమం చేస్తున్న రైతుల అభిప్రాయాలను గౌరవించి మూడు వ్యవసాయ చట్టాలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పునరుద్ఘాటించారు. ఇప్పటికే రైతులతో 11 సార్లు చర్చించినట్లు తెలిపారు. 5వ నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ అగ్రివిజన్ సమావేశానికి హాజరైన ఆయన.. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను పెంచేందుకే ఈ మూడు చట్టాలను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ చట్టాల ద్వారా తమ ఉత్పత్తులను ఎక్కడైనా విక్రయించే స్వేచ్ఛ రైతులకు లభించిందని వివరించారు.
ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు తోమర్. వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టి విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. వీరి వైఖరి రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలకు చోటుందని, కానీ అది దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండకూడదని హితవు పలికారు. చట్టాలు రైతులకు ఏ విధంగా హాని చేస్తాయన్న విషయంపై చర్చించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు.
"రైతు సంఘాలతో పాటు విపక్ష పార్టీలు సైతం ఈ చట్టాల్లో లోపాలను గుర్తించలేకపోయాయి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఏ పార్టీ వైఖరినైనా అనుసరించవచ్చు. కానీ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పణంగా పెట్టి, రైతుల త్యాగాలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉందా అనే విషయాన్ని దేశ యువత గమనించాలి. చట్టాలను సవరిస్తున్నామని ప్రభుత్వం ప్రతిపాదిస్తోందంటే.. దానర్థం చట్టాల్లో లొసుగులు ఉన్నాయని కాదు. రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ ప్రతిపాదన చేసింది. కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంది."