దేశంలో నక్సల్స్‌ను కట్టడి చేసేందుకు.. భద్రతను పెంచడం సహా వారికి అందే నిధులకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఇదే అజెండాగా.. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులతో ఆదివారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో సమాలోచనలు జరిపారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, బిహార్ సీఎం నితీశ్ కుమార్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ భేటీకి హాజరయ్యారు.
బంగాల్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల తరఫున అక్కడి ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, గిరిరాజ్ సింగ్, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, నిఘా విభాగం డైరెక్టర్ అర్వింద కుమార్, పౌర, పోలీస్ అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా..
మావోయిస్టులకు సాయం చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవడం, భద్రతాపరమైన లోపాలను నివారించడం వంటి అంశాలపైనా సీఎంతో చర్చించారు అమిత్ షా. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణం.. తదితర వివరాలను ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకున్నారు.
నక్సల్ సమస్య తీవ్రంగా ఉన్న జిల్లాల్లోని ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఏకలవ్య పాఠశాలలు సహా పోస్టాఫీసులు ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది.