తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో పిల్లల టీకాకు అనుమతి - డీసీజీఐ

vaccine
భారత్​లో మరో టీకాకు అనుమతి! మూడు డోసులు తప్పనిసరి!!

By

Published : Aug 20, 2021, 5:17 PM IST

Updated : Aug 21, 2021, 7:08 AM IST

17:11 August 20

భారత్​లో పిల్లల టీకాకు అనుమతి

భారత్‌లో మరో కొవిడ్‌-19 టీకాకు ఆమోద ముద్ర పడింది. జైడస్‌ క్యాడిలా సంస్థ దేశీయంగా అభివృద్ధి చేసిన 'జైకోవ్‌-డి' వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) శుక్రవారం పచ్చ జెండా ఊపింది. మిగతా టీకాలకు భిన్నంగా దీన్ని 3 డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది. 12-18 ఏళ్ల వారికి కూడా దీన్ని  ఇవ్వవచ్చు. ఈ వయసువారికి దేశంలో అందుబాటులోకి వచ్చిన మొదటి కొవిడ్‌ టీకా ఇదే. 

జైకోవ్‌-డి.. ప్రపంచంలోనే డీఎన్‌ఏ ఆధారంగా రూపొందిన తొలి వ్యాక్సిన్‌ అని బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) వెల్లడించింది. 'మిషన్‌ కొవిడ్‌ సురక్ష' కింద డీబీటీ భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేశారు. జైకోవ్‌-డికి ఆమోదం లభించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత శాస్త్రవేత్తల నూతన ఆవిష్కార సామర్థ్యానికి ఇది మచ్చు తునక అని పేర్కొన్నారు. అంతకుముందు జైకోవ్‌-డి అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలని భారత కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీఓ)లోని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. \

భారత్‌లో ఇలాంటి ఆమోదం పొందిన కొవిడ్‌ టీకాల్లో ఇది ఆరోది. ఇప్పటికే కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వి, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్లకు మన దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి లభించిన సంగతి తెలిసిందే. వాటిలో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌, స్పుత్నిక్‌ వి టీకాలు మాత్రమే ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయి. 'జైకోవ్‌-డి' వ్యాక్సిన్‌ దేశీయ పరిజ్ఞానంతో తయారైన రెండో టీకా. దేశంలో ఏటా 10-12 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైడస్‌ క్యాడిలా ఈ సందర్భంగా తెలిపింది. 

  • జైకోవ్‌-డి.. ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏ సాంకేతికత ఆధారంగా తయారైన వ్యాక్సిన్‌. కరోనాలోని స్పైక్‌ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసేలా శరీరానికి ఇది సంకేతాలిస్తుంది. ఆ ప్రొటీన్‌ ఉత్పత్తి ఫలితంగా శరీరంలో రోగ నిరోధక స్పందన వెలువడుతుంది. ఇది కొవిడ్‌ నుంచి రక్షణ, వైరస్‌ నిర్మూలనలో కీలక పాత్ర పోషిస్తుందని డీబీటీ తెలిపింది.
  • జైకోవ్‌-డిని చర్మంలోకి ఎక్కిస్తారు. ఇందుకోసం సూది అవసరం ఉండదు. నొప్పి లేకుండా ‘ఫార్మాజెట్‌’ అనే సాధనం ద్వారా దీన్ని ఎక్కిస్తారు. వ్యాధి లక్షణాలతో కూడిన కొవిడ్‌ నుంచి రక్షణ కల్పించడంలో ఈ వ్యాక్సిన్‌ 66.6 శాతం సమర్థతను చాటినట్లు మూడో దశ క్లినికల్‌ ప్రయోగాలకు సంబంధించిన మధ్యంతర ఫలితాలు చెబుతున్నాయి.

మోదీ హర్షం.. 

దేశీయంగా అభివృద్ధి చేసిన జైడస్​ క్యాడిలా అత్యవసర వినియోగానికి అనుమతి పొందడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటానికి రూపొందించిన డీఎన్​ఏ ఆధారిత టీకా ఆమోదం పొందడం ముఖ్యమైన ఘట్టంగా పేర్కొన్నారు. భారత శాస్త్రవేత్తల కృషికి ఇది నిదర్శనం అని కొనియాడారు.  

Last Updated : Aug 21, 2021, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details