కరోనా సోకిన వారు వైరస్ నుంచి కోలుకున్న తొమ్మిది నెలల తర్వాత టీకా తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ప్రభుత్వ ప్యానెల్.. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్(ఎన్‌టీఏజీఐ) సిఫార్సు చేస్తోంది. గతంలో ఆరు నెలల వ్యవధి ఉండాలని సూచించిన ఈ ప్యానెల్.. ఇప్పుడు దాన్ని తొమ్మిది నెలలకు పెంచింది. తాజా ప్రతిపాదనలను ప్యానెల్ కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆరోగ్యశాఖ ప్రస్తుత ప్రొటోకాల్ ప్రకారం.. కరోనా బారినపడ్డవారు కోలుకున్నాక 4-8 వారాల తర్వాత కొవిడ్ టీకా తీసుకోవచ్చు. అయితే ఈ వ్యవధి పెరిగితే శరీరంలో యాంటీబాడీలు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతాయని ఎన్‌టీఏజీఐ చెబుతోంది.
''కరోనా సోకి కోలుకున్నవారు తొలి డోసు టీకా కోసం మరింత ఎక్కువ కాలం వేచి ఉంటే మంచిది. తొమ్మిది నెలల తర్వాత టీకా తీసుకున్నట్లయితే అది శరీరంలో ఎక్కువ మొత్తంలో యాంటీబాడీలు వృద్ధి చెందేందుకు దోహదపడుతుంది.''