పెగసస్ హ్యాకింగ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం జరిగింది. సభ సజావుగా జరగకపోవడానికి సర్కారే కారణమని రాహుల్ వ్యాఖ్యానించగా.. కేంద్ర మంత్రి వాటిని ఖండించారు.
ఈ మేరకు ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ.. జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలపై పార్లమెంట్లో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. సమయం వృథా చేయకుండా.. పెగసస్పై చర్చించాలని డిమాండ్ చేశారు. ధరల పెరుగుదల, రైతుల సమస్యలపై చర్చించుకోవాలని అన్నారు.
"పార్లమెంట్ సభ్యులుగా.. ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలి. జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలపై చర్చించాలి. ఇదే మన ప్రజాస్వామ్యానికి పునాది. విపక్షాలు ఈ పని చేయడానికి అనుమతించడం లేదు. పార్లమెంట్ సమయాన్ని వృథా చేయొద్దు. పెగసస్, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలపై చర్చిద్దాం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
అయితే, రాహుల్ తీరును పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తప్పుబట్టారు. అసలు ప్రాముఖ్యం లేని అంశాన్ని సమస్యగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. సభ సజావుగా నడవటం కేంద్రానికి ఇష్టం లేదని చెప్పడం తగదని పేర్కొన్నారు.