ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా రేషన్ సరకులు పొందుతున్న లబ్ధిదారుల కోసం కేంద్రం కొత్త యాప్‌ను విడుదల చేసింది. 'మేరా రేషన్' పేరిట తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా కార్డుదారులు దగ్గర్లోని రేషన్ దుకాణం పేరు, లభించే సరకులు, ఇటీవల జరిపిన లావాదేవీలు వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
ముఖ్యంగా సొంత ప్రదేశం నుంచి కొత్త ప్రదేశానికి వలస వెళ్లే వారికి ఈ యాప్ ఎంతగానో ఉపయోపడుతుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ వ్యవస్థ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుదాన్షు పాండే వెల్లడించారు. ఈ యాప్ ద్వారా 'వన్ నేషన్ వన్ రేషన్' కార్డు కింద రేషన్ కార్డు పోర్టబులిటీని కూడా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పాండే తెలిపారు. ప్రస్తుతం 32 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ విధానం అమల్లో ఉందన్నారు.