Govt Job Without Exam :మీరు ప్రైవేటు సంస్థలో ఉన్నత ఉద్యోగులా? ఎలాంటి పోటీపరీక్షలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. కేవలం ప్రైవేటు సంస్థలో వృత్తి నిపుణులుగా ఉద్యోగం చేసిన అనుభవం ఉంటే చాలు, ప్రభుత్వ కొలువు సాధించవచ్చు. ఆ ఉద్యోగాలు ఏమిటో, వారిని ఎవరు నియమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
నీతి అయోగ్
ఉద్యోగం : కన్సల్టెంట్ & సీనియర్ కన్సల్టెంట్
నీతి అయోగ్ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఒక విధాన కమిటీ. ఇది పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ప్రభుత్వ ఆర్థిక వ్యూహాలను రచిస్తుంది. ప్రభుత్వ పథకాలు సరిగా అమలు జరుగుతున్నాయో లేదో పర్యవేక్షిస్తుంది. ఈ పనుల కోసం ఆయా రంగాల్లో విశేష అనుభవం ఉన్నవారిని కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్లుగా నియమించుకుంటుంది. వీరు పథకాల అమలును పర్యవేక్షించాలి. మేజర్ ప్రోజెక్టుల విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలి. అవసరమైతే కలసి పనిచేయాల్సి ఉంటుంది.
ఇన్వెస్ట్ ఇండియా
ఉద్యోగం : ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్
ఇన్వెస్ట్ ఇండియా అనేది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ. ఈ సంస్థ భారత్లో పెట్టుబడి అవకాశాల కోసం అన్వేషిస్తున్నవారికి దేశంలో ఉన్న అవకాశాలను తెలుసుకునేందుకు సహాయ పడుతుంది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, వాణిజ్య మంత్రిత్వశాఖలతో ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ సంస్థ ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ ఉద్యోగాలకు సమాయానుకూలంగా ప్రకటనలు వెలువరిస్తుంది. వివిధ రాష్ట్రప్రభుత్వాలను సమన్వయం చేస్తూ ఇన్వెస్ట్మెంట్లను పెంచడమే ఈ జాబ్ రోల్ ముఖ్య ఉద్దేశం.