గ్రామాల్లో కరోనా రెండో దశ విజృంభణ అధికంగా ఉన్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి కట్టడికి కేంద్రం నూతన మార్గదర్శకాలు రూపొందించింది. ప్రతి గ్రామీణ ప్రాంతం కనీసం 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. హోం క్వారంటైన్ సాధ్యం కాని చోట.. లక్షణాలు లేని వారికి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ కేంద్రాల్లో చికిత్స అందించాలని తెలిపింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, హెల్త్- వెల్నెస్ సెంటర్లలో ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.
పట్టణ ప్రాంతాలతో పాటు.. క్రమంగా గ్రామీణ, ట్రైబల్, పెరీ అర్బన్ ప్రాంతాల్లో కేసుల పెరుగుదల నమోదవుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన మరిన్ని సూచనలు
- కరోనా నిర్ధరణ అయిన వారితో పాటు అనుమానితులనూ కొవిడ్ కేర్ సెంటర్లో చేర్చుకోవచ్చు. అయితే వీరిని ఉంచే గదులు వేర్వేరుగా ఉండాలి. లోపలికి వచ్చే, వెళ్లే మార్గాలు వేరుగా ఉండాలి. అనుమానితులను, నిర్ధరణ అయిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో ఒక్క చోట ఉంచకూడదు.
- ఇన్ఫ్లుయెంజా వంటి వ్యాధులపై ప్రతి గ్రామంలో ఆశా కార్యకర్తలు సర్వే చేపట్టాలి. ఇందుకు గ్రామ ఆరోగ్య పారిశుధ్యం, పోషకాహార కమిటీ సహాయాన్ని తీసుకోవాలి.
- లక్షణాలు ఉన్న కేసులను గ్రామీణ స్థాయిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్(సీహెచ్ఓ) పరీక్షించాలి. ఆక్సిజన్ స్థాయి తక్కువ ఉన్నవారిని పై కేంద్రాలకు పంపించాలి.
- అనుమానిత వ్యక్తులకు యాంటీజెన్ పరీక్షలు నిర్వహించాలి. లేదా ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం నమూనా సేకరించి దగ్గర్లోని ల్యాబ్‌కు పంపాలి.
- ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల నిర్వహణ విషయంలో సీహెచ్ఓలు సుశిక్షితులై ఉండాలి.
- ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్లు అన్ని ప్రజారోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలి.
- కేసుల సంఖ్య, వైరస్ వ్యాప్తి ఆధారంగా కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించాలి.
- 80-85 శాతం కొవిడ్ కేసులు లక్షణాలు లేకుండానే/ స్వల్ప లక్షణాలతో ఉంటున్నాయి. కాబట్టి ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేని వారికి ఇంట్లోనే చికిత్స అందించాలి. లేదంటే కొవిడ్ కేర్ సెంటర్లో ఉంచాలి.
- కొవిడ్ రోగుల్లో ఆక్సిజన్ స్థాయులను పరీక్షించేందుకు ప్రతి గ్రామం తగినన్ని పల్స్ ఆక్సీమీటర్లు, థర్మామీటర్లను సిద్ధంగా ఉంచుకోవాలి.
- పారాసిటమాల్, ఐవర్‌మెక్టిన్, దగ్గు మందు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లతో కూడిన హోం ఐసోలేషన్ కిట్లను బాధితులకు అందించాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సవివర కరపత్రం ఇవ్వాలి.
- జిల్లా ఆస్పత్రులు, ఇతర ప్రైవేటు ఆస్పత్రులను కొవిడ్ చికిత్స అందించే ప్రత్యేక ఆస్పత్రులుగా మార్చాలి.
ఇదీ చదవండి:'తౌక్టే' తీవ్ర రూపం- అమిత్ షా సమీక్ష