New cds of india: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ మృతి చెందారు. ఇప్పుడు ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారన్న ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. తదుపరి సీడీఎస్‌ను ఎంపిక చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్న నేపథ్యంలో అతి త్వరలోనే ఈ ప్రక్రియను మొదలుపెట్టనుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే.. సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవణెకు త్రిదళాధిపతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
కమిటీ సిఫార్సుల ఆధారంగా..
Committee to select cds of india: మరో ఐదు నెలల్లో జనరల్ ఎంఎం నరవణె పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీనియార్టీ ప్రకారం సీడీఎస్ పదవికి నరవణెనే అర్హుడని పలువురు మాజీ కమాండర్లు, అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. సీడీఎస్ ఎంపిక కోసం ఆర్మీ, వాయుసేన, నౌకదళానికి చెందిన సీనియార్ కమాండర్లతో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేయనుందని అధికార వర్గాలు గురువారం తెలిపాయి.
"కమిటీ సిఫార్సుల ఆధారంగా రెండు మూడు రోజుల్లో సీడీఎస్ ఎంపికపై తుది నిర్ణయం తీసుకుని.. ఆమోదం కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వద్దకు పంపిస్తారు. రక్షణమంత్రి ఆమోదం తర్వాత కమిటీ సిఫార్సులను కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ వద్దకు పంపిస్తారు. ఆ తర్వాత తదుపరి సీడీఎస్ ఎంపికపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. సమర్థులైన అభ్యర్థులను సీడీఎస్ పదవికి ఎంపిక చేసే ప్రక్రియలో.. పలువురు ఉన్నత స్థాయి అధికారులు పాల్గొంటారు.
-అధికారవర్గాలు.
General mm naravane rawat successor: త్రివిధ దళాలకు అధిపతులను ఎంపిక చేయడంలో ఏదైతే విధానాన్ని కేంద్రం అనుసరిస్తుందో సీడీఎస్ ఎంపికలోనూ అదే తరహా విధానాన్ని పాటించనుంది. చీఫ్స్ ఆప్ స్టాఫ్ కమిటీ(సీఓఎస్సీ)కి సీడీఎస్ అధిపతిగా వ్యవహరిస్తారు. చైనాతో తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వివాదం సహా వివిధ అంశాలను జనరల్ నరవణె సమర్థంగా పరిష్కరించిన నేపథ్యంలో ప్రభుత్వం నరవణెకే సీడీఎస్ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు అధికంగా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి.