కేవలం రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లోని ఓటర్ల ఆదరాభిమానాలను చూరగొనడానికి బడ్జెట్‌ను ఉపయోగించుకోవాలని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తాపత్రయపడటం సహజమే. అందుకే అసోం, బంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రకటించింది. దీనివల్ల అసోం, బంగాల్‌లలో భాజపాకు గెలుపు ధీమా పెరుగుతుందని; తమిళనాడు, కేరళలలో విజయావకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బడ్జెట్‌లో దక్షిణ, తూర్పు భారత రాష్ట్రాల పట్ల గతంలోకన్నా ఎక్కువ శ్రద్ధ పెట్టామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు కూడా.
తమిళనాట తొలగిన అనిశ్చితి
ఎన్నికలకు వెళ్ళనున్న నాలుగు రాష్ట్రాల్లో మెగా మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ.2,25,000 కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధిక భాగం నిధులు (రూ.1.03లక్షల కోట్లు) ఒక్క తమిళనాడుకే దక్కుతాయి. వీటిని రాబోయే అయిదేళ్లలో ఖర్చు చేయనున్నారు. ఈ నిధుల్లో సింహ భాగాన్ని మధురై-కొల్లాం కారిడార్ పైన, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని జిల్లాలను అనుసంధానించే చిత్తూరు-థాచూర్ కారిడార్‌మీద, ఇంకా అనేక రహదారి ప్రాజెక్టులపై వ్యయం చేస్తారు. తమిళనాడులో అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీచేయనున్నామని భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా వ్యాఖ్యానించిన రెండు రోజుల్లోనే- కేంద్రం బడ్జెట్ వరాలను ప్రకటించడం గమనార్హం. నడ్డా మాటలద్వారా భాజపా-అన్నాడీఎంకే పొత్తుపై అనిశ్చితి తొలగిపోయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలుగా తాము భాజపాతో కలిసే పోటీ చేస్తామని తమిళనాడు అన్నాడీఎంకే ముఖ్యమంత్రి పళనిస్వామి గతంలోనే స్పష్టం చేసినా- భాజపా చాలాకాలంపాటు ఎటూ తేల్చకుండా తాత్సారం చేస్తూ వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి బరిలో దిగాలని ఆశించడం దీనికి కారణం కావచ్చు. రజనీకాంత్ సొంత పార్టీ ప్రారంభిస్తే- భాజపా దానితో పొత్తు పెట్టుకొంటుందని ఊహాగానాలు వినిపించాయి. చివరికి రజనీకాంత్ కరోనా మహమ్మారిని, తన ఆరోగ్య పరిస్థితిని కారణాలుగా చూపి రాజకీయ అరంగేట్రానికి నిరాకరించడంతో భాజపాకు అన్నాడీఎంకేతో చేతులు కలపక తప్పనట్లుంది. అన్నాడీఎంకేకు జూనియర్ భాగస్వామిగా అసెంబ్లీలో కొన్ని సీట్లు గెలవగలనని ఆశిస్తోంది. అందుకే తమిళనాడు పట్ల తన అభిమాన ప్రదర్శనకు బడ్జెట్‌ను సాధనం చేసుకుంది.
మోదీ ఆధ్వర్యంలో..
జనవరి 19న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి ఎస్.పళనిస్వామి దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసి బడ్జెట్‌లో తమిళనాడు కోసం కొత్త ప్రాజెక్టులు ప్రకటించాలని, నిధుల కేటాయింపులు పెంచాలని కోరారు. తదనుగుణంగా సీతారామన్ బడ్జెట్‌లో రాష్ట్రానికి వరాలు ప్రకటించారు. పళనిస్వామి కోరిన ప్రాజెక్టులూ అందులో ఉన్నాయి. ప్రధాని మోదీ ఫిబ్రవరి 14న తమిళనాడును సందర్శించి కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 2021-22లో చెన్నై-సేలం మధ్య 277 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి పళనిస్వామి పట్టుదలగా ఉన్నారు. ఈ పథకాన్ని 2018లోనే ప్రకటించినా- రైతులు వ్యతిరేకించారు. చివరికి 2020 డిసెంబరులో సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపడంతో భూసేకరణకు అడ్డంకులు తొలగిపోయాయి. 278 కిలోమీటర్ల బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ రహదారి నిర్మాణం కూడా 2021-22లో ప్రారంభమవుతుంది. రూ.63,246 కోట్లతో 118.9 కిలోమీటర్ల చెన్నై మెట్రో రైల్వే రెండో దశ నిర్మాణానికీ కేంద్రం నిధులిస్తుంది. ముంబయి నుంచి కేరళ మీదుగా కన్యాకుమారిని కలిపే 600 కిలోమీటర్ల కారిడార్ కూడా తమిళనాడుకు లబ్ధి కలిగిస్తుంది. భారతదేశ తీరంలోని అయిదు ఫిషింగ్ హార్బర్లలో చెన్నై ఒకటి. మిగతావి కొచ్చి, విశాఖపట్నం, పారదీప్, పెటువాఘాట్ రేవుల్లో ఉన్నాయి. వీటికితోడుగా నాగపట్నం జిల్లాలోని వెళ్లపల్లంలో కూడా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం నడుం కట్టింది. భారీగా ఉపాధి అవకాశాలను కల్పించి, అదనపు ఆదాయాలకు బాటలు పరచే సముద్ర నాచు సాగు ప్రాజెక్టును తమిళనాడు తీరంలో చేపట్టనున్నట్లు సీతారామన్ బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ ప్రాజెక్టు కోసం బహుళార్థ సాధక పార్కును ఏర్పాటు చేస్తామన్నారు.
కేరళలో..
కేరళలో రాజకీయంగా ఎదగాలని భాజపా చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా పురోగతి సాధించలేకపోతోంది. అక్కడ కాంగ్రెస్, వామపక్ష కూటములే తడవకు ఒకటి చొప్పున అధికారం పంచుకుంటూ వస్తున్నాయి. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయ విజయాలు సాధించిన వామపక్ష కూటమి ఈసారీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తోంది. అయినా భాజపా బడ్జెట్ కేటాయింపుల ద్వారా కేరళ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చాటుకుంది. కొచ్చి మెట్రో విస్తరణకు రూ.1,957 కోట్లు కేటాయించి, కొచ్చి రేవును భారీ వ్యాపార కూడలిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. 30 లక్షల ప్రవాసీ కేరళీయులకు సీతారామన్ తీపి కబురు అందించారు. ఇంతవరకు ఏడాదికి అయిదు కోట్ల రూపాయల వరకు ఆదాయంపై రెండు చోట్ల పన్ను విధింపు నుంచి మినహాయింపు ఇస్తుండగా, ఇకపై ఈ పరిమితిని పది కోట్ల రూపాయలకు పెంచుతారు. ఇది ప్రవాస కేరళీయుల్లో భాజపాకు ఆదరణను పెంచవచ్చు.
ప్రాజెక్టులే గెలుపు గుర్రాలుగా...
పశ్చిమ్ బంగలో గెలుస్తామని ధీమా కనబరుస్తున్న భాజపా కేంద్ర బడ్జెట్‌లో ఆ రాష్ట్రానికి పెద్ద ప్రాజెక్టులు కేటాయించింది. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికీ, కోల్‌కతా-సిలిగురి రహదారుల పునరుద్ధరణకు రూ.25,000 కోట్లను ప్రకటించింది. సిలిగురి ఉత్తర బెంగాల్‌లో అతిపెద్ద పట్టణం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర బెంగాల్ లోని ఎనిమిది లోక్‌సభ సీట్లకు ఏడింటిని భాజపాయే గెలుచుకుంది. ఖరగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు రైల్వే రవాణా కారిడార్ల అభివృద్ధి ప్రాజెక్టు కూడా బడ్జెట్‌లో ఉంది. పశ్చిమ్ బంగ, అసోమ్‌లలో తేయాకు పరిశ్రమ అభివృద్ధికి రూ.1,000 కోట్లు ప్రకటించారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి జనంలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న మమతా బెనర్జీకి ఈ ఎన్నికల్లో భాజపా నుంచి తీవ్ర సవాలు ఎదురవడం ఖాయం. అసోమ్‌లో ముఖ్యమంత్రి శర్వానంద్ సోనోవాల్ నాయకత్వంలో మళ్లీ అధికారం చేపడతామని భాజపా ధీమాగా ఉంది. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో రూ.34,000 కోట్లతో 1,300 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం చేపడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటికే అక్కడ రూ.19,000 కోట్ల జాతీయ రహదారుల పనులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రకటించింది దానికి అదనం. తాము చేపట్టిన ఈ ప్రాజెక్టులు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలుగా ఉపయోగపడతాయని భాజపా నమ్ముతోంది.
- శేఖర్ అయ్యర్, రచయిత - ప్రముఖ పాత్రికేయులు
ఇదీ చదవండి:బడ్జెట్‌తో దేశానికి 'ఆత్మ నిర్భరం':గడ్కరీ