కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విపక్షాలు పెదవి విరిచాయి. కేటాయింపులపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి. వ్యాధి ఒకటైతే చికిత్స మరొకటి అన్న చందంగా ఉందని కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. క్షీణిస్తున్న జీడీపీని గాలికొదిలేశారని ఆరోపించారు.
బడ్జెట్‌తో పేదలకు అండగా నిలవాల్సిన మోదీ సర్కార్.. ప్రభుత్వ ఆస్తులను తన పెట్టుబడిదారి మిత్రులకు కట్టబెట్టేలా కేటాయింపులు చేసినట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలకు ఊతమందించాలని డిమాండ్ చేశారు. రక్షణ రంగానికి చేసిన కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేశారు రాహుల్.
క్లిష్ట పరిస్థితుల్లో గొప్ప బడ్జెట్‌ను ప్రవేశపెడతారని భావించామని కాంగ్రెస్ లోక్‌సభాపక్షనేత అధీర్ రంజన్ చౌధురీ అన్నారు. అయితే అస్పష్టమైన చర్యలతో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారన్నారు.
"కొన్ని రాష్ట్రాల్లో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ను రూపొందించారు. ధనాన్ని ఖర్చు చేస్తామన్నారు. పేదలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉంటుందని భావించాం. కానీ అది జరగలేదు. పెట్టుబడులు ఉపసంహరణ, ప్రవేటీకరణ వంటి చర్యలతో.. ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టింది."
- అధీర్ రంజన్ చౌధురీ, కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత
'మేకపోతు గాంభీర్యం'
"ఆర్థిక మంత్రి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారు. దేశానికి పారదర్శక బడ్జెట్ అవసరం. బలహీన వర్గాలకు నేరుగా సాయమందిస్తే.. ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యేవి" అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనందద్ శర్మ అన్నారు. వినియోగదారుడి డిమాండ్‌ను పునరుద్ధరించి.. వృద్ధికి ఊతమందించేలా ఎలాంటి ప్రణాళిక లేకపోవడం వల్ల బడ్జెట్ అసంతృప్తిగా ఉందన్నారు.