BJP STATE OBSERVERS: ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన భాజపా.. ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసింది. ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి పరిశీలకులను నియమించింది. ఉత్తర్ ప్రదేశ్ పరిశీలకునిగా హోంమంత్రి అమిత్ షాను ఎంపిక చేయగా.. ఉత్తరాఖండ్‌కు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అధిష్ఠానం పంపుతోంది.
మణిపుర్, గోవాలో ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి ఎంపిక బాధ్యతలను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్‌కు అప్పగించింది. గోవాలో స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఒక్క అడుగు దూరంలో ఆగిన భాజపా.. స్వతంత్రుల సాయంతో అధికార పీఠం చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి అమిత్ షాతో పాటు సహ పరిశీలకునిగా భాజపా ఉపాధ్యక్షుడు రఘుబర్ దాస్, ఉత్తరాఖండ్ శాసనసభాపక్ష నేత ఎంపిక కోసం రాజ్‌నాథ్ సింగ్‌కు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి సహాయం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మణిపుర్ సహ పరిశీలకునిగా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, గోవా సహ పరిశీలకునిగా ఎల్ మురుగన్‌లు కొద్దిరోజుల పాటు వారికి కేటాయించిన రాష్ట్రాల్లో పర్యటించనున్నారు.