తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పట్టు వీడని రైతన్న- 11వ రోజుకు చేరిన ఆందోళనలు

దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తున్న ఆందోళన 11వ రోజుకు చేరింది. ఉద్యమానికి మద్దతుగా దిల్లీ సరిహద్దులకు వివిధ ప్రాంతాల రైతులు భారీగా తరలివెళ్తున్నారు. కేంద్రం, రైతు సంఘాల మధ్య శనివారం సుధీర్ఘంగా జరిగిన భేటీలో ఎలాంటి ఫలితమూ తేలలేదు. దీంతో చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొని ఈ నెల9న మరోసారి భేటీకావాలని నిర్ణయించారు. ఈనెల 8న చేపట్టిన భారత్‌ బంద్‌ యథావిధిగా కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు.

Govt-farmers talks: No breakthrough after five rounds; Next meeting on Dec 9
పట్టు వీడని రైతన్న- 11వ రోజుకు చేరిన ఆందోళనలు

By

Published : Dec 6, 2020, 5:20 AM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు 11వ రోజుకు చేరాయి. రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల్లో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య శనివారం సుధీర్ఘంగా జరిగిన భేటీలో ఎలాంటి ఫలితమూ తేలలేదు. మూడు వ్యవసాయ చట్టాల రద్దుపై ఔను, కాదు అని ఏదో ఒక సమాధానం చెప్పాలని కిసాన్ నేతలు పట్టుబట్టగా.. అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని మంత్రులు కోరారు. దీంతో చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొని ఈ నెల9న మరోసారి భేటీకావాలని నిర్ణయించారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరుబాట పట్టిన రైతు సంఘాలతో కేంద్రం జరుపుతున్న చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య శనివారం మధ్యాహ్నం రెండున్నర నుంచి రాత్రి 7 గంటల వరకూ సుధీర్ఘంగా జరిగిన చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పియూష్‌ గోయల్‌, సోంప్రకాశ్‌, ఇతర అధికారులు, రైతుల తరఫున 40మంది ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. మూడు నల్ల చట్టాలు రద్దు చేస్తారా? లేదా? చెప్పాలని.. అంతకుమించి తాము మాట్లాడేందుకు ఏమీలేదని రైతుసంఘాల నేతలు ఉడుంపట్టు పట్టడంతో కేంద్రమంత్రులు ఏమీ సమాధానం చెప్పలేకపోయారు. అత్యంత బలహీనమైన చట్టాలను కొనసాగించడంలో ప్రభుత్వ ఉద్దేశమేంటో చెప్పాలని, రైతు వ్యతిరేకమైన చట్టాలను బలవంతంగా రుద్దడం వెనుక ప్రయోజనాలేంటి? అని రైతుసంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. బిల్లుల రద్దుపై తప్ప మిగతా వాటిపై చర్చించే ప్రసక్తే లేదన్న కిసాన్ నేతలు నిశ్శబ్దంగా మౌనవ్రతం పాటించారు.

మౌనవ్రతం..

ఈ నేపథ్యంలో వెనక్కి వెళ్లిపోయిన మంత్రులు పది నిమిషాల తర్వాత మళ్లీ వచ్చి అభ్యంతరాలను లిఖితపూర్వకంగా సమర్పిస్తే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి చెబుతామని పేర్కొన్నారు. చట్టాల రద్దే తమ ఏకైక డిమాండ్ అని స్పష్టం చేసిన రైతులు.. వాటి గురించి కాకుంటే మద్దతుధరపై అయినా చర్చించాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో మద్దతు ధరపై తర్వాత చర్చిద్దామన్న మంత్రులు చట్టాలపై అభ్యంతరాలను తెలపాలని సూచించగా.. రైతులు అందుకు వ్యతిరేకత వ్యక్తం చేశారు. వ్యవసాయశాఖ కార్యదర్శి, ఇతర అధికారులు చట్టాల గురించి వివరించబోగా రైతు ప్రతినిధులు అడ్డుకున్నారు. ప్రసంగాలు ఆపి చట్టాలు రద్దు చేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఔను ,కాదు అని రాసిఉన్న కాగితాలను ప్రదర్శించారు. చట్టాలను సవరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి తోమర్ వెల్లడించగా ఇప్పటికే అభ్యంతరాలను తెలియజేశామన్న రైతు సంఘాలు.. సాగదీయకుండా ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు గంటసేపు మౌనవ్రతం పాటించాయి.

డిమాండ్‌లపై ప్రభుత్వంలోని పెద్దలు, వివిధ మంత్రిత్వశాఖల అధికారులతో చర్చించి స్పందిస్తామని అందుకు సమయం కావాలని మంత్రులు కోరడంతో రైతులు అంగీకరించారు. అయితే ఈనెల 8న చేపట్టిన భారత్‌ బంద్‌ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కార్మిక సంఘాల మద్దతు..

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 8న రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌కు పలు ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు మద్దతు తెలిపాయి. ఆర్జేడీ, తృణమూల్‌ కాంగ్రెస్, డీఎంకే, వామపక్షాలతో పాటు పది కార్మిక సంఘాలు భారత్‌బంద్‌కు మద్దతు ప్రకటించాయి. ఈమేరకు రాష్ట్రాల్లో చేపట్టే నిరసనలలో రైతుల పక్షాన నిలవనున్నట్లు ఆయా పార్టీలు తెలిపాయి. తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలను ఉద్ధృతం చేయనున్నట్లు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తెలపారు. డిసెంబర్ 8 నుంచి 3రోజుల పాటు రైతులకు సంఘీభావంగా దీక్షలో కూర్చోనున్నట్లు తృణమూల్‌ కాంగ్రెస్ ప్రకటించింది. వ్యవసాయ చట్టాలను కేంద్రం ఉపసంహరించేంత వరకూ రైతు ఉద్యమంలో పాలుపంచుకుంటామని వామపక్ష పార్టీలు తెలిపాయి. ఐఎన్​టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్​ఎంసీ, సీఐటీయూ వంటి 10 కార్మిక సంఘాలతో కూడిన ఐక్యవేదిక సైతం రైతులకు మద్దతుగా పోరాటం ఉద్ధృతం చేస్తామని ప్రకటించింది.

ఇదీ చూడండి: తేజస్వీ సహా 18 మందిపై కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details