దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను(Covid 19 Containment) నవంబరు 30 వరకు పొడిగిస్తున్నట్లు గురువారం తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా సమావేశం నిర్వహించారు.
దేశంలో రోజువారీ కేసులు, వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య తగ్గుతున్నా.. కొన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ విజృంభణ(Covid-19 India) సవాల్‌గా మారిందని అజయ్ కుమార్ భల్లా తెలిపారు.
"పాజిటివిటీ రేటు, ఆస్పత్రుల్లో సౌకర్యాలు, ఐసీయూ పడకల సామర్థ్యం.. తదితర అంశాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పండగ సీజన్లో వైరస్ వ్యాప్తిని ఐదు విభాగాల(టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, బిహేవియర్) ద్వారా కట్టడి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిరవధికంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొనసాగించాలి."