తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా, ధరలపై చర్చకు ప్రభుత్వం సిద్ధం! - వెంకయ్యనాయుడు అఖిల పక్షం భేటీ

సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్​ సమావేశాలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. కరోనాను ఎందుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యాలపై, ధరల పెరుగుదలపై ప్రధానంగా విపక్షాలు చర్చకు పట్టుపట్టనుండగా.. అందుకు అధికార పక్షం కూడా సమ్మతించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అఖిలపక్ష నేతలతో రాజ్యసభ ఛైర్మన్​ ఎం.వెంకయ్యనాయుడు నేడు భేటీ కానున్నారు.

Monsoon Session of Parliament
పార్లమెంట్​ సమావేశాలు

By

Published : Jul 17, 2021, 7:12 AM IST

పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి జరగనున్న నేపథ్యంలో అధికార, విపక్షాలు అందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ సమావేశాల్లో కరోనాను ఎదుర్కోవడం, ధరల పెరుగుదలపై చర్చకు ప్రభుత్వం సమ్మతించే అవకాశం ఉంది. వీటిని ప్రస్తావించాలని ప్రతిపక్షాలు నిర్ణయించడంతో ప్రభుత్వం కూడా సిద్ధపడుతోంది. ఇవికాకుండా రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు, దేశ ఆర్థిక పరిస్థితులు తదితర సమస్యలను కూడా లేవనెత్తాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఈ సమావేశాల్లో కొత్తగా 17 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవి కాకుండా లోక్‌సభలో నాలుగు, రాజ్యసభలో మూడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

నేడు అఖిలపక్ష నేతలతో వెంకయ్యనాయుడు సమావేశం

రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు శనివారం సాయంత్రం అఖిలపక్ష నేతలతో భేటీ కానున్నారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో 40కిపైగా పార్టీల నాయకులు హాజరు కానున్నారు.

మాజీ మంత్రులతో రాజ్‌నాథ్‌ భేటీ

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం అదే శాఖ మాజీ మంత్రులైన ఎ.కె.ఆంటోని (కాంగ్రెస్‌), శరద్‌ పవార్‌ (ఎన్‌సీపీ)లను కలిశారు. తూర్పు లద్దాఖ్‌లో తలెత్తిన సరిహద్దు సమస్యను, సైన్యం సన్నద్ధతను వారికి వివరించారు. ఆయన వెంట త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవాణే ఉండడం విశేషం. చైనాతో సరిహద్దు వివాదాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని కాంగ్రెస్‌ నిర్ణయించిన నేపథ్యంలో ఈ సమావేశాలు జరగడం విశేషం. మరోవైపు రాజ్యసభలో భాజపా నేత పీయూష్‌ గోయల్‌ కూడా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, శరద్‌ పవార్‌, మరికొందరితో సమావేశమయ్యారు.

ఇదీ చూడండి:సోనియాకు పంజాబ్ సీఎం ఘాటు లేఖ

ABOUT THE AUTHOR

...view details