Parliament monsoon session 2022: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా సాగే అవకాశం ఉంది. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలకు వారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారపక్షం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి వచ్చేనెల 12వ తేదీ వరకూ పార్లమెంటు సమావేశాలు జరగనుండగా 32 బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. త్రివిధ దళాల్లో తాత్కాలిక నియామకాలకు సంబంధించిన అగ్నిపథ్ పథకం, ఆర్థికవ్యవస్థ, నిరుద్యోగం, నిత్యావసర ధరల పెరుగుదల వంటి అంశాలను లేవనెత్తాలని విపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం ఉభయసభలు సజావుగా సాగేందుకు సహకరించాలని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రతిపక్షాలను కోరారు. నిబంధనల ప్రకారం అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే ఈ సమావేశానికి ప్రధాని హాజరుకాకపోవటాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. వివిధ శాఖలు 32 బిల్లులను సూచించినట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో 14 బిల్లులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
All Party Meeting: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి పలు పార్టీల ఫ్లోర్ లీడర్లు, నేతలు హాజరయ్యారు. ప్రభుత్వం తరపున కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్ హాజరు కాగా.. కాంగ్రెస్ నుంచి మల్లిఖార్జున ఖర్గే, అధిర్ రంజన్ చౌధురి, జైరాం రమేశ్ సహా డీఎంకే, టీఎంసీ, ఎన్‌సీపీ, బీజేడీ, వైకాపా, తెరాస, ఆర్జేడీ, శివసేన నేతలు హాజరయ్యారు.
అగ్నిపథ్‌పై చర్చకు సిద్ధం:మహిళా రిజర్వేషన్ బిల్లు, శ్రీలంక సంక్షోభం, రూపాయి విలువ పతనం, చైనా దురాక్రమణ, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై తాజా సమావేశాల్లో చర్చ చేపట్టాలని పలు విపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు. ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ.. సభా నిబంధనలకు అనుగుణంగా నోటీసు ఇచ్చి సభాధ్యక్షులు అనుమతించిన ఏ అంశంపైనైనాసరే చర్చించడానికి కేంద్రం సిద్ధమని పేర్కొన్నారు. అగ్నిపథ్ పథకంపైనా చర్చకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న అటవీ హక్కుల చట్టం-2006 సవరణ బిల్లుపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గుర్తుచేశారు. ఒకవైపు గిరిజన మహిళ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టబోతున్నామంటూ గొప్పలు చెప్పుకొంటూనే.. మరోవైపు గిరిజనుల హక్కులను దెబ్బతీసే బిల్లును తీసుకొస్తుండటం ఎంతవరకు సబబని అందరూ ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.
అసభ్య పదజాలానికి సంబంధించిన మార్గదర్శకాలపై పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా జోషి వివరణ ఇచ్చారు. పార్లమెంటులో సభ్యుల ప్రసంగాలపై, వారు ఉపయోగించే పదాలపై నిషేధమేమీ విధించలేదని.. వివిధ సందర్భాల్లో రికార్డుల నుంచి తొలగించిన పదాలను మాత్రమే కరదీపిక రూపంలో విడుదల చేశామని చెప్పారు. అంతమాత్రాన ఆ పదాలను ఇకముందు మాట్లాడటానికి వీల్లేదని అర్థం చేసుకోవద్దన్నారు. పార్లమెంటు ఆవరణలో ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేయకూడదని సూచిస్తూ ప్రతి సమావేశానికి ముందు మార్గదర్శకాలు విడుదల చేయడమూ ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేశారు.
'అది అన్ పార్లమెంటరీ కాదా?'.. సమావేశాల్లో ధరల పెరుగుదల, అగ్నిపథ్, సమాఖ్య వ్యవస్థపై దాడి, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం సహా 13 అంశాలపై చర్చించాలని అఖిలపక్ష భేటీలో డిమాండ్ చేసినట్లు విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే వెల్లడించారు. ఇదే సమయంలో అఖిలపక్ష సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకాకపోవటంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అఖిలపక్ష భేటీకి ఎప్పటిలాగే ప్రధాని మోదీ గైర్హాజరయ్యారంటూ కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. 'ఇది అన్ పార్లమెంటరీ కాదా?' అని ప్రశ్నించారు.