తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొలీజియం సిఫార్సులకు పచ్చజెండా! - సుప్రీం కోర్టు కొలిజీయం నిర్ణయం

సుప్రీం కోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తూ కొలీజియం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం తెలిపి నియామక ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

SC, supreme court
సుప్రీం కోర్టు, కొలీజియం

By

Published : Aug 26, 2021, 5:21 AM IST

సుప్రీంకోర్టుకు కొత్తగా 9 మంది న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 17వ తేదీన తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ సిఫార్సులను పరిశీలించిన న్యాయశాఖ వాటిని ప్రధాని మోదీ కార్యాలయానికి పంపించగా, అక్కడి నుంచి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ వద్దకు వెళ్లాయి. కొలీజియం సిఫార్సులకు ఎలాంటి మార్పులు, చేర్పులు సూచించలేదని సమాచారం.

న్యాయమూర్తుల నియామకాల్లో విభిన్న కోణాలను అనుసరించాలని ఇదివరకు 9 మంది, అయిదుగురు సభ్యుల ధర్మాసనాలు వేర్వేరు సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకొన్న కొలీజియం ఈసారి సామాజిక, ప్రాంతీయ, లింగ సమతౌల్యాన్ని పాటిస్తూ పేర్లను సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు చరిత్రలో ఒకేసారి తొమ్మిది మంది న్యాయమూర్తులను, అందులోనూ ముగ్గురు మహిళా న్యాయమూర్తులను నియమించడం ఇదే తొలిసారి.

వచ్చే సోమవారం కల్లా..

ఒకట్రెండు రోజుల్లో రాష్ట్రపతి ఆమోదం తెలిపి నియామక ఉత్తర్వులు జారీచేస్తే వచ్చే సోమవారం కొత్త న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేపట్టే అవకాశం ఉంటుంది. వీరి ప్రమాణంతో సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరనుంది. ఒక్క ఖాళీ మాత్రమే మిగులుతుంది. సుప్రీంకోర్టు కొలీజియం ఈనెల 17న సమావేశం కాగా, 18వ తేదీన న్యాయమూర్తి జస్టిస్‌ నవీన్‌ సిన్హా పదవీ విరమణ చేశారు. ఫలితంగా ఆ ఒక్క ఖాళీకి పేరును సిఫార్సు చేయలేకపోయింది.

కొత్త న్యాయమూర్తుల్లో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓకా, గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీటీ రవికుమార్‌, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, గుజరాత్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, సీనియర్‌ అడ్వొకేట్‌ పి.ఎస్‌.నరసింహ ఉన్నారు.

భవిష్యత్తులో ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశం వీరిలో ముగ్గురికి లభించవచ్చు. ముగ్గురు కొత్త మహిళా న్యాయమూర్తుల రాకతో సుప్రీంకోర్టులో మొత్తం మహిళా న్యాయమూర్తుల సంఖ్య 4కి చేరుతుంది.

ఇదీ చదవండి:సుప్రీంకోర్టు కొలీజియం చొరవ- న్యాయవ్యవస్థలో నారీశక్తి

ABOUT THE AUTHOR

...view details