కరోనా చికిత్సకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో సమాచారం కోకొల్లలుగా వస్తోంది. ఇందులో ఏది నిజమో, ఏది అబద్ధమో సామాన్యులు తెలుసుకోలేని పరిస్థితి. కొందరు వాటిని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే వేడి నీళ్లు తాగడం, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా నయమవుతోందన్న ప్రచారం వెలుగులోకి వచ్చింది. అయితే, ఈ విషయంపై భారత ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. వేడి నీళ్లు కరోనాను చంపడం లేదా తగ్గించడమనేది నిజం కాదని వెల్లడించింది. ప్రయోగశాలలో ప్రత్యేక పద్ధతుల్లో 60-75 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే కరోనా వైరస్ మరణిస్తుందని తెలిపింది.
వేడి నీళ్ల స్నానంతో.. కరోనా రాదా? - వేడి నీళ్లు తాగడంపై కేంద్రం
వేడి నీళ్లు తాగడం, వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా నయమవుతోందన్న ప్రచారంపై ప్రభుత్వం స్పష్టతను ఇచ్చింది. వేడి నీళ్ల స్నానం, వేడి నీళ్లను తాగడం ద్వారా శరీరానికి ఉపశమనం లభిస్తుందన్న మాట వాస్తవమే అని కానీ వీటి వల్ల కరోనా రాదన్నది నిజం కాదని వెల్లడించింది.
వేడినీళ్లు తాగడం, వాటితో స్నానం చేయడం వల్ల కరోనా అంతం అవ్వడం మాట అటుంచితే.. శరీరానికి ఎంతోకొంత ఉపశమనం లభిస్తుందనేది వాస్తవం. వేడినీళ్ల స్నానం వల్ల ఒళ్లునొప్పులు తగ్గుతాయి. మొదడు ఆరోగ్యంగా ఉంటుంది. కండరాలకు, జాయింట్లకు రక్త సరఫరా సరిగా అందుతుంది. అలాగే మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గొంతు నొప్పి తగ్గడానికి వేడి నీళ్లలో ఒక చిటికెడు ఉప్పు, పసుపు వేసుకుని ఆ నీటితో పుక్కిలించడం వల్ల ఉపశమనం కలుగుతుందని ఆయుష్ శాఖ సూచించింది. వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. అయితే, వేడి నీటి స్నానం, వేడినీరు తాగడం వల్ల కరోనా రాదన్నది నిజం కాదని చెబుతూనే.. మాస్కు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం, అత్యవసరం అయితేనే బయటికి వెళ్లడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. వాటి వల్లే కరోనా రాకుండా చూసుకోవచ్చని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి :బ్లాక్ ఫంగస్: ఔషధం ఉత్పత్తికి సన్నాహాలు