దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు 13 రకాల పరిశ్రమలకు ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహం(పీఎల్ఐ) ఇవ్వాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. మరో 2 పరిశ్రమలకు దానిని అందించేందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఎయిర్ కండిషనర్లు, ఎల్‌ఈడీ లైట్లు వంటి తెల్ల వస్తువులు, అధిక సమర్థత గల సౌర ఫలకాల తయారీ రంగానికి ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాన్ని అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏసీలు, ఎల్ఈడీ లైట్ల తయారీ రంగానికి రూ. 6,238 కోట్లతో పథకాన్ని ప్రకటించింది. అధిక సమర్థత గల సౌర ఫలకాల తయారీ రంగానికి రూ. 4,500 కోట్ల ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాన్ని అందిస్తారు.
ఇప్పటికే ఏడు పరిశ్రమలకు దీనిని అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకం వల్ల దేశీయ పరిశ్రమకు గణనీయమైన ప్రయోజనం కలిగి.. కోటి ఉద్యోగాలు వస్తాయని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.