No Approval from Governor Tamilisai for TSRTC Bill : ప్రజా రవాణా వ్యవస్థను బాధ్యతగా భావించి, ఆర్టీసీ సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఇటీవలే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదింప చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు మంత్రివర్గ నిర్ణయానికి అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన బిల్లును రూపొందించి.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించింది. సాంకేతికపరంగా అది ఆర్థిక బిల్లు కావడం వల్ల గవర్నర్ ఆమోదం కోసం.. రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు పంపింది. అయితే ఆర్టీసీ బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలపలేదు. అనుమతి తెలిపితే ఇతర బిల్లులతో పాటు ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడంతో ఎజెండాలో పొందుపరచలేదు.
TSRTC Bill Pending at Rajbhavan : అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా గవర్నర్ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. బిల్లు పంపి.. ఇప్పటికే రెండు రోజులైనా అనుమతి ఇవ్వకపోవడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం, కార్మికులను ఇబ్బందిపెట్టాలనే ఉద్దేశంతోనే గవర్నర్ ఇలా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఆర్టీసి బిల్లు విషయంలో గవర్నర్ అనుసరిస్తున్న తాత్సార వైఖరి బడుగు బలహీన వర్గాలు, పేదలే అధికంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు మరిన్ని ఇబ్బందులు సృష్టించే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కేబినెట్లో కీలక నిర్ణయం..: రాష్ట్రంలోని ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఇటీవలే శుభవార్త చెప్పింది. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సుమారు 43,373 మంది ఆర్టీసీ కార్మికులకుప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపులభిస్తుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఉద్యోగులుగా గుర్తింపుపై విధి విధానాల కోసం సబ్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సబ్ కమిటీ అధ్యక్షుడిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉంటారని.. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. దేశంలోనే మొదటిసారిగా 1932లో నిజాం రాష్ట్ర రైల్వే రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. 166 మంది కార్మికులు, 27 బస్సులతో ప్రారంభమైన సంస్థను నవంబర్ 1, 1951లో హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 1950 రోడ్డు రవాణా సంస్థ చట్టం ప్రకారం... 2016 మార్చి 27న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో 43 వేల 373 మంది ఉద్యోగులున్నారు. వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఉద్యోగ భద్రతతో పాటు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ జీతాలకు ఇబ్బంది ఉండదని కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడేందుకూ.. ప్రభుత్వ సాయం ఉంటుందని ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. కొత్త బస్సుల కొనుగోలు, పీఆర్సీ వంటివి ఉంటాయని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
ఇవీ చూడండి..:
KCR vs Governor Tamilisai: 'తెలంగాణలో ప్రోటోకాల్ పాటించటం లేదు'
Pending Bills Issue Telangana : అసెంబ్లీ సమావేశాల వేళ.. మరోసారి చర్చకు గవర్నర్ తిప్పిపంపిన బిల్లుల అంశం