Jharkhand Governor: ఝార్ఖండ్‌లో ఆటం బాంబు ఏ క్షణమైనా పేలుతుందని ఆ రాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్ వ్యాఖ్యానించారు. ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్.. లాభదాయక పదవి అంశంపై రెండో అభిప్రాయం కోరినట్లు ఆయన చెప్పారు. దీపావళి కోసం.. సొంతూరు రాయపూర్ వెళ్లిన రమేష్ బైస్.. ఎవరి పరువూ తీసే ఉద్దేశం తనకులేదన్నారు.
'రాష్ట్రంలో ఏ క్షణమైనా ఆటం బాంబు పేలుతుంది'.. గవర్నర్ కీలక వ్యాఖ్యలు! - undefined
ఝార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏ క్షణమైనా ఆటం బాంబు పేలుతుందని తెలిపారు. దీపావళి కోసం.. సొంతూరు రాయపూర్ వెళ్లిన రమేష్ బైస్.. ఎవరి పరువూ తీసే ఉద్దేశం తనకులేదన్నారు.
ముఖ్యమంత్రిగా ఉంటూ తనకు మైనింగ్ లీజు కేటాయించుకున్న హేమంత్ సోరెన్‌పై అనర్హత వేటు వేయాలని భాజపా సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై గవర్నర్ కోరిక మేరకు.. కేంద్రం ఎన్నికల సంఘం నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ఇంకా బహిర్గతం కాలేదు. కానీ ఎమ్మెల్యేగా సోరేన్‌ను అనర్హుడిగా ప్రకటించాలని.. ఈసీ సిఫారసు చేసినట్లు వార్తలొచ్చాయి.
గవర్నర్ తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తున్నారని జేఎంఎం, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. కానీ తనకు అలాంటి ఉద్దేశం లేదని గవర్నర్ చెప్పారు. అలాంటి ఉద్దేశం ఉంటే.. ఎప్పుడో ఈసీ సిఫారసు ప్రకారం చర్యలు తీసుకునేవాడినని చెప్పారు. మళ్లీ రెండో అభిప్రాయం కోరినట్లు తెలిపారు. రెండో అభిప్రాయం వచ్చిన తర్వాత పెద్ద నిర్ణయం ఉంటుందా అని ప్రశ్నించగా.. బాణసంచాపై నిషేధం దిల్లీలోనే కానీ ఝార్ఖండ్‌లో కాదన్నారు. ఏదైనా ఒక ఆటంబాంబు పేల వచ్చని గవర్నర్ రమేష్ బైస్ చమత్కరించారు.