తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ప్రభుత్వానికి, ప్రజలకు స్నేహితుడిగా, మార్గదర్శిగా గవర్నర్' - భారత ప్రజాస్వామ్య గొప్పతనం ఏమిటి?

దిల్లీలో 51వ గవర్నర్ల సదస్సు జరిగింది. దీనికి రాష్ట్రపతి అధ్యక్షత వహించారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఓ స్నేహితుడిగా, తత్వవేత్తగా, మార్గదర్శిగా గవర్నర్‌లు ఉంటారని రాజ్యాంగ నిర్మాతలు భావించినట్లు రామ్​నాథ్ కోవింద్ తెలిపారు.

PRESIDENT
రాష్ట్రపతి

By

Published : Nov 11, 2021, 3:55 PM IST

Updated : Nov 11, 2021, 5:51 PM IST

గవర్నర్లు తమకు కేటాయించిన రాష్ట్రాల్లో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ సూచించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం గవర్నర్లు కట్టుబడి ఉండాలని కోరారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల 51వ సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.

"రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో గవర్నర్ల బాధ్యత ఏమిటి అనే అంశంపై నిపుణులైన రాజ్యాంగ రూపకర్తలు తీవ్రంగా చర్చించారు. సాధారణ ప్రజలకు, ప్రభుత్వానికి స్నేహితునిగా, తత్వవేత్తగా, మార్గదర్శకునిగా ఉంటారని భావించి ఈ వ్యవస్థను రూపొందించారు."

--రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

ప్రజల్లో చైతన్యం పెంపొందించడం, జాతీయ లక్ష్యాల సాధనలో ప్రజా భాగస్వామ్యం ఉండేలా చేయడంలో గవర్నర్ల పాత్ర ఎంతో కీలకమని రామ్​నాథ్ కోవింద్ అన్నారు.

"మీరంతా మీ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే ఉన్నారని గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నా. దీనిని నెరవేర్చేందుకు వీలైనంత ఎక్కువ సమయం రాష్ట్రానికి కేటాయిస్తూ.. ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం అవసరం. జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలను సందర్శించాలని కోరుతున్నా."

--రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

కరోనా వారియర్స్​పై ప్రశంసలు..

'ప్రధాని మోదీ నాయకత్వంలో కరోనాపై పోరులో గవర్నర్లు చురుకుగా పనిచేశారు. అద్భుత సహకారం అందించారు' అని రాష్ట్రపతి ప్రశంసించారు. కరోనా యోధులు అంకితభావంతో పని చేశారని కొనియాడారు​. పరిమిత వనరులు ఉన్నప్పటికీ కరోనాపై భారత్​ గొప్ప పోరాటం సాగించిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకు అండగా నిలిచిందని గుర్తు చేశారు.

" రెండేళ్ల విరామం తర్వాత ఈ రోజు సమావేశమయ్యాం. కొవిడ్​-19 మహమ్మారిపై మన కరోనా యోధులు అంకితభావంతో పోరాటం చేశారు. నేటికి 108 కోట్ల డోసుల కొవిడ్​ టీకాల పంపిణీ జరిగింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ వేగంగా కొనసాగుతోంది."

--రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

1949 నుంచి ఏటా గవర్నర్ల సదస్సు జరుగుతోంది. అయితే కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన భేటీ గతేడాది రద్దయింది.

ఇవీ చదవండి:

Last Updated : Nov 11, 2021, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details