కేరళలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వీసీలు రాజీనామా చేయాలంటూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పందించారు. గవర్నర్కు అలాంటి అధికారాలు లేవని అన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. విశ్వవిద్యాలయాలను నాశనం చేయాలనే ఉద్దేశంతోనే గవర్నర్ ఇలా చేస్తున్నారని విజయన్ మండిపడ్డారు. ఈ తొమ్మిది యూనివర్సిటీలకు వీసీలను నియమించింది గవర్నరే అని.. ఈ నియామకాలు చట్ట విరుద్ధంగా జరిగితే గవర్నర్దే ప్రాథమిక బాధ్యతని అన్నారు.
నేను రాజీనామా చేయను..
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కోరినట్లుగా తాను రాజీనామా చేయబోనని కన్నూర్ యూనివర్సిటీ వీసీ.. గోపీనాథ్ రవీంద్రన్ తేల్చిచెప్పారు. తన నియామకానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని ఆయన తెలిపారు. కోర్టులో కేసు ఉన్నప్పుడు వీసీని గవర్నర్ ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. మరోవైపు, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వీసీలను రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ.. 9 మంది వైస్ ఛాన్సలర్లు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు.
కేరళ విశ్వవిద్యాలయం, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేరళ యూనివర్శిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్, కన్నూర్ విశ్వవిద్యాలయం, ఏపీజే అబ్దుల్ కలాం సాంకేతిక విశ్వవిద్యాలయం, శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం, కాలికట్ విశ్వవిద్యాలయం, తునాచత్ ఎజుతాచన్ మలయాళ విశ్వవిద్యాలయం వీసీలు సోమవారం ఉదయం 11 గంటలలోపు రాజీనామా చేయాలని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు.