మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం.. చివరి అంకానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. భాజపా నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ ఎంట్రీతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. మెజారిటీని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆదేశించారు. ఈ మేరకు లేఖ రాశారు. దీంతో శిందే వర్గం ఎమ్మెల్యేలు గురువారం గువాహటి నుంచి ముంబయి చేరుకోనున్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రేను బలపరీక్షకు ఆదేశించాలని భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ గవర్నర్‌ను కోరిన కొద్ది గంటల్లోనే ఈ పరిణామం జరగడం గమనార్హం.
అయితే బుధవారం ఉదయం తిరుగుబాటు నాయకుడు ఏక్‌నాథ్ శిందే కీలక ప్రకటన చేశారు. గురువారం ఉదయం తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి ముంబయికి చేరుకుంటానని చెప్పారు శిందే. అఘాడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలపరీక్షలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.
దాదాపు వారం రోజులు తర్వాత శిందే వర్గం ఎమ్మెల్యేలు గువాహటిలోని లగ్జరీ హోటల్ నుంచి బయటికి వచ్చారు. శిందేతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు గువాహటిలోని కామాఖ్య ఆలయాన్ని దర్శించుకున్నారు. మహారాష్ట్ర ప్రజల సంతోషం కోసం ప్రార్థించానని శిందే తెలిపారు. అ సమయంలోనే గురువారం ముంబయి వెళ్తామని ఆయన వెల్లడించారు.
సుప్రీం కోర్టుకు వ్యవహారం:బలపరీక్ష నిరూపణకు గవర్నర్ ఆదేశించినా.. అఘాడీ సర్కారు మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనపడటం లేదు. బలపరీక్ష నిరూపణను వాయిదా వేసేందుకు న్యాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ కురువృద్ధుడు పృథ్వీరాజ్ చవాన్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
సంజయ్‌రౌత్ మండిపాటు:గవర్నర్ నిర్ణయాన్ని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ మండిపడ్డారు. బలనిరూపణ ఆదేశాలను సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. 16 మంది ఎమ్మెల్యేల అనర్హత అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బలనిరూపణ చట్టవిరుద్ధం అన్నారు రౌత్. ఫడనవీస్ కలిసిన కొద్ది గంటల్లోనే గవర్నర్ నిర్ణయం తీసుకోవడం చూస్తుంటే.. ఆయన కూడా సమయం కోసమే ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోందని వెల్లడించారు సంజయ్ రౌత్.
ఎమ్మెల్యేలకు భాజపా ఆదేశం:ఇదిలా ఉంటే.. బలపరీక్ష నిరూపణకు గవర్నర్ ఆదేశించిన నేపథ్యంలో భాజపా తమ ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఎమ్మెల్యేలందరూ బుధవారం సాయంత్రం లోపు ముంబయిలోని తాజ్ హోటల్‌కు రావాలని ఆదేశించింది.
అసెంబ్లీలో ఎవరి బలమెంత?:అధికార మహా వికాస్ అఘాడీ కూటమిలోని శివసేనకు 55, ఎన్సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది శాసన సభ్యులు ఉన్నారు. ప్రతిపక్షం భాజపాకు 106 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే శిందే తిరుగుబాటుతో.. ఆయన వెంట 39 మంది శివసేన ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు స్వతంత్రులు శిందే వర్గంలో ఉన్నారు. అసెంబ్లీలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 287 మంది సభ్యులున్నారు. శివసేన అసమ్మతి నేతలు 39 మంది గురువారం సభకు హాజరుకాకపోతే అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 248కి తగ్గనుంది. ఈ క్రమంలో ఠాక్రే తన బలాన్ని నిరూపించుకోవాలంటే 125 మంది సభ్యుల మద్దతు అవసరం అవుతుంది. ప్రస్తుతం మహా వికాస్ అఘాడీ కూటమి సంఖ్యా బలం 113 మాత్రమే. ఈ పరిస్థితుల్లో బలపరీక్ష ఎదురైతే ఠాక్రే సర్కారు కుప్పకూలే ప్రమాదం ఉంది.
ఇదీ చదవండి:దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. మరో 14వేల మందికి వైరస్