NV Ramana Comments: కోర్టులు వెలువరించే తీర్పులు, వ్యక్తం చేసే అభిప్రాయాలు తమ అభీష్టానికి అనుగుణంగా లేనప్పుడు.. ఆయా ప్రభుత్వాలు న్యాయమూర్తులను కించపరుస్తున్నాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఇది కొత్త పోకడ అని, అత్యంత దురదృష్టకర పరిణామమని వ్యాఖ్యానించింది. ఇదివరకు ప్రైవేటు పార్టీలు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేసేవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై మాజీ ఐఏఎస్ అధికారి అమన్కుమార్పై నమోదైన ఎఫ్ఐఆర్ను ఛత్తీస్గఢ్ హైకోర్టు కొట్టేసింది. దీన్ని సవాలు చేస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అవినీతి వ్యతిరేక కార్యకర్త ఉచిత్ శర్మ కూడా దీనిపై అప్పీలు దాఖలు చేశారు.
వీటిపై జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం పట్ల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ "మీరు సీనియర్ న్యాయవాది. ప్రభుత్వం కోర్టును దూషించడం మొదలుపెట్టింది. కోర్టులోనూ రోజూ దీన్ని చూస్తున్నాం. ఈ కొత్త పోకడ గురించి మాకంటే ఎక్కువగా మీకే తెలుసు. ఇది చాలా దురదృష్టకర పరిణామం" అని పేర్కొన్నారు.