Free Ration Extended: పేదలకు అందిస్తున్న ఉచిత రేషన్ పథకాన్ని మరో 3నెలలు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కేంద్ర ఖజానాపై రూ.44,700 కోట్ల భారం పడనుంది. ఈ నిర్ణయం వల్ల అధిక ద్రవ్యోల్బణం నుంచి పేదలకు ఊరట కల్పించనుంది. దాంతోపాటు త్వరలో జరిగే గుజరాత్ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
80 కోట్ల మంది పేదలకు..
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 80 కోట్ల మంది పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ పథకం సెప్టెంబరు 30న ముగియనుండడం వల్ల డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు కేంద్రం 2020 ఏప్రిల్ లోప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను ప్రారంభించింది.
రైల్వే ఉద్యోగులకు దసరా బొనాంజా..
Indian Railway bonus news: కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు దసరా బొనాంజా అందించింది. 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ కింద ఈ ప్రయోజనాన్ని అందించనుంది. నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు ఈ బెనిఫిట్ లభిస్తుంది. 11.56 లక్షల మంది ఉద్యోగులకు ఊరట కలుగనుంది. బోనస్ ప్రకటన నిర్ణయం వల్ల ప్రభుత్వంపై రూ.2 వేల కోట్ల మేర భారం పడనుంది.