ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖేరి జిల్లాలో విషాద సంఘటన జరిగింది. టాయిలెట్ గోడలు, సీలింగ్ కూలడం వల్ల ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. నాసిరకంగా టాయిలెట్ నిర్మాణం చేపట్టడం వల్లే ఈ విషాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరిగినప్పటికీ అధికారులు ఎవరూ స్పందించకపోవడం విచారకరమని అంటున్నారు.
మగల్‌గంజ్ ప్రాంతంలోని చపర్తల గ్రామానికి చెందిన లల్తా ఇంటి బయట ప్రభుత్వ నిధులతో కట్టిన మరుగుదొడ్డి ఉంది. ఈ మరుగుదొడ్డిని 2016లో నిర్మించారు. దానిని నాసిరకపు ఇటుకలతో నిర్మించారని స్థానికులు చెబుతున్నారు. అందువల్ల ఆ టాయిలెట్‌ను ఎవరూ వినియోగించడం లేదు. శనివారం లల్తా ఐదేళ్ల కుమారుడు పంకజ్ తన స్నేహితులతో కలిసి టాయిలెట్ దగ్గర ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా మరుగుదొడ్డి సీలింగ్, గోడలు పేకమేడలా కూలి పడిపోయాయి. పక్కనే ఉన్న చిన్నారి.. ఆ శిథిలాల కింద పడి మృతి చెందాడు. మరుగుదొడ్డి నిర్మాణానికి నాసిరకం వస్తువులు వాడారని చిన్నారి బంధువులు ఆరోపిస్తున్నారు.
మరుగుదొడ్ల నిర్మాణంపై విమర్శలు
ప్రభుత్వ నిధులతో నిర్మించిన మరుగుదొడ్లు కూలిపోవడం విమర్శలకు దారి తీస్తోంది. 'ఏడేళ్ల క్రితమే మరుగుదొడ్డిని నిర్మించారు. కానీ, పెద్దగా దానిని ఉపయోగించలేదు. మరుగుదొడ్డిలోకి వెళ్లాలంటేనే భయపడే విధంగా దాని నిర్మాణం జరిగింది. సర్పంచ్, గ్రామ సెక్రటరీ టాయిలెట్‌ను కాంట్రాక్ట్‌పై నిర్మించారు. మొదటి నుంచి మరుగుదొడ్డి పరిస్థితి బాలేదు. దానిని ఉపయోగించడమే మానేశాము. చాలా ఏళ్లుగా మరుగుదొడ్డిని ఎవరూ ఉపయోగించకుండా అలా నిలిచిపోయింది' అని చిన్నారి తల్లి లల్తా తెలిపింది. ఈ ప్రమాదం శనివారం జరిగింది. చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్షల కోసం పంపినట్లు ఇన్‌స్పెక్టర్, ఇన్‌ఛార్జ్ దీపక్ రాయ్ తెలిపారు.