Government CPR Training :ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో అనేక మంది మరణిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి మరణాలు తీవ్ర కలవరం సృష్టిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం గుజరాత్‌లో దసరా పండగ సందర్భంగా గర్బా నృత్యం చేస్తూ పలువురు మృతి చెందడం ఆందోళన కలిగించింది. ఈ అనూహ్య మరణాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సీపీఆర్ టెక్నిక్‌లో శిక్షణ ఇచ్చేందుకు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
సీపీఆర్‌పై శిక్షణా కార్యక్రమం
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ డిసెంబర్ 6న ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ శిక్షణ దేశంలోని అన్ని ప్రాంతాల్లో అమలుకానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 10 లక్షల మందికి సీపీఆర్‌పై శిక్షణ కల్పిస్తారు. గుర్తింపు పొందిన వెయ్యికి పైగా వైద్యకేంద్రాల ద్వారా ఈ శిక్షణ ఇస్తారు. జిమ్‌లో పనిచేసేవారూ ఈ శిక్షణలో భాగస్వాములు అవ్వనున్నారు.
అధికారిక లెక్కల ప్రకారం- 2021 నుంచి 2022 మధ్య గుండెపోటు వల్ల కలిగే మరణాలు 12.5 శాతం పెరిగాయి. గుండెపోటు మరణాల గురించి ఇటీవలే మాండవీయ మాట్లాడారు. కొవిడ్-19 కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలకు గురై కోలుకున్నవారు తర్వాత ఒకటి నుంచి రెండేళ్లపాటు ఎక్కువగా శ్రమించకపోవడమే మంచిదని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనాన్ని వెల్లడించారు.