Farmers protest end: సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు కీలక ప్రకటన చేశారు. చట్టాలను ఇప్పటికే రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా తమ డిమాండ్లన్నింటినీ అంగీకరించిందని రైతు నాయకుడు సత్నామ్ సింగ్ తెలిపారు. నిరసన విరమించే అంశంపై డిసెంబర్ 4న నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
32 రైతు సంఘాలు కలిసి సోనీపత్లోని కుండ్లీ సరిహద్దు వద్ద సమావేశమయ్యాయి. ఈ భేటీలోనే తాజా నిర్ణయం తీసుకున్నట్లు సత్నామ్ సింగ్ వెల్లడించారు. కనీస మద్దతు ధరపై చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం ఒప్పుకుందని తెలిపారు. చట్టం కోసం కమిటీ ఏర్పాటు చేయనుందని, ఇందుకోసం ఐదుగురు పేర్లను సిఫార్సు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చాకు సూచించిందని చెప్పారు.
దీంతో పాటు రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, కేంద్ర హోంశాఖ లేఖలు పంపిందని చెప్పారు సత్నామ్ సింగ్. డిసెంబర్ 1 లేదా 4వ తేదీన మరోసారి సంయుక్త కిసాన్ మోర్చా సమావేశం అవుతుందని వెల్లడించారు. కమిటీ సభ్యుల పేర్లతో పాటు తదుపరి కార్యాచరణపై అప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నారు.