ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో భూమి వేగంగా కుంగుతున్నట్లు 'నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్' (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) వెల్లడించిన నివేదిక సంబంధిత వెబ్‌సైట్‌లో ఇప్పుడు కనిపించడంలేదు. జోషీమఠ్‌లో కొంతకాలంగా భూమి వేగంగా కుంగిపోతోందని ఇస్రోకు చెందిన ఈ కేంద్రం నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. 12 రోజుల వ్యవధిలోనే 5.4 సెం.మీ మేర కుంగినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి.. ఉపగ్రహ చిత్రాలతో కూడిన నివేదికను విడుదల చేసింది. దీనిపై మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చిన తరుణంలో ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఆ నివేదిక కనిపించకుండా పోయింది. ప్రజల్లో గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ప్రభుత్వమే దానిని తొలగించినట్లు తెలుస్తోంది.
ఆంక్షలు ఎందుకంటే..
ప్రజలు, మీడియా సొంత కోణంలో వివరణలు ఇస్తుండటం జోషీమఠ్‌తోపాటు దేశవ్యాప్తంగా గందరగోళానికి దారితీస్తున్నట్లు జాతీయ విపత్తుల నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్‌డీఎంయే) పేర్కొంది. వీటికి సంబంధించిన సమాచారాన్ని మీడియాతో గానీ, సామాజిక మాధ్యమాల్లో గానీ పంచుకోవద్దని, తగిన అనుమతి తీసుకోకుండా అనధికారికంగా వ్యాఖ్యలు చేయవద్దని ప్రభుత్వ విభాగాలకు స్పష్టం చేసింది. నిపుణుల కమిటీ పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాత వాటిని వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నట్లు తెలిపింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వమూ ఇదే మాట చెబుతోంది.