Bilkis Bano News: 2002నాటి గోద్రా అనంతర అల్లర్ల సమయంలో గర్భిణీపై సామూహిక అత్యాచారం సహా బాధితురాలు బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా హత్య చేసిన ఘటనలో దోషులు.. జైలు నుంచి విడుదల కావడంపై దుమారం రేగుతోంది. ఈ కేసులో 11 మందికి సీబీఐ కోర్టు జీవిత ఖైదు విధించగా.. దాదాపు 15 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం 11 మందికి క్షమాభిక్ష ప్రసాదించగా.. వారు సోమవారం గోద్రా సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో 2008 జనవరి 21న నిందితులకు జీవిత ఖైదు పడగా.. దాదాపు 15 ఏళ్లు జైలులో ఉన్నారు. తమను విడుదల చేయాలంటూ దోషుల్లో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అతడి అభ్యర్థనను పరిశీలించి, నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకోసం గుజరాత్ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటుచేయగా 11మందికి క్షమాభిక్ష పెట్టి విడుదల చేయాలని నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా సోమవారం ఖైదీల విడుదలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. జైలు నుంచి విడుదలైన వారికి.. బంధువులు పూలదండలు వేసి, మిఠాయిలు తినిపించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఖైదీల విడుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జూన్ నెలలో మార్గదర్శకాలు విడుదల చేసింది. అత్యాచార కేసుల్లో దోషులను మాత్రం విడుదల చేయరాదని స్పష్టం చేసింది. కానీ సుప్రీంకోర్టు దిశానిర్దేశం మేరకు గుజరాత్ ప్రభుత్వం సొంత మార్గదర్శకాలను అనుసరించి.. 11 మందిని విడుదల చేసింది.