షూటింగ్లో భారీ అగ్ని ప్రమాదం.. సీరియల్ సెట్ దగ్ధం! సీరియల్ సెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి చుట్టపక్కల ప్రాంతాలలో దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటన ముంబయిలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.
ముంబయి గోరేగావ్ ఫిల్మ్ సిటీలో "గమ్ హై కిసికే ప్యార్ మే" అనే టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోంది. సెట్స్‌లో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో అకస్మాత్తుగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. షూటింగ్ జరుగుతున్న 2 వేల చదరపు అడుగులు ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ స్టూడియోలో మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్నవారు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందించారు.
సీరియల్ సెట్లో చెలరేగిన మంటలు ఘటనాస్థలికి 12 ఫైర్ ఇంజన్లు, ఏడు వాటర్ జెట్లు, ఒక వాటర్ ట్యాంకర్, మూడు ఆటోమేటిక్ టర్న్-టేబుల్స్, ఒక క్విక్ రెస్పాన్స్ వెహికల్‌ను పంపించింది బృహన్ ముంబయి కార్పొరేషన్. అనంతరం ఈ అగ్ని ప్రమాదాన్ని లెవెల్-3, లెవెల్-4 గా అగ్నిమాపక దశం గుర్తించింది. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని కాలేదని ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ అవినాష్ ధాక్నే తెలిపారు. ప్లైవుడ్ లాంటి పదార్థాలతో సెట్‌ను తయారు చేశారని.. అందుకే మంటలు త్వరగా వ్యాపించాయని ఆయన పేర్కొన్నారు. దీనికి తోడు గాలి బలంగా వేయడం వల్ల మంటలు భారీగా ఎగసిపడ్డాయని చెప్పారు. ఇక, సీరియల్ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని నిర్మాణ సంస్థ కాక్రో ఎంటర్టైన్మెంట్స్ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, ఆయేషా సింగ్, నీల్ భట్, ఐశ్వర్య శర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సీరియల్ 'గమ్ హై కిసీ కే ప్యార్ మే'. ఇది 2020 అక్టోబర్‌లో ప్రారంభమైంది.
సీరియల్ సెట్లో చెలరేగిన మంటలు ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ ఇంజిన్లు ఆచార్య సెట్లో చెలరేగిన మంటలు..
అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28న అగ్ని ప్రమాదం జరిగింది. 'ఆచార్య' సినిమా కోసం హైదరాబాద్‌లోని కోకాపేట్లో వేసిన 'ధర్మస్థలి' అనే సెట్లో రాత్రి సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో సెట్లో ఎవరు లేనందున ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
కాగా, సినిమాలోని ధర్మస్థలి అనే ఊరు కోసం వేసిన ఈ భారీ సెట్లో.. సినిమాలోని పలు సన్నివేశాలను అక్కడే చిత్రీకరించారు. 'భరత్ అనే నేను' సినిమాకు పని చేసిన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సెల్వ రాజన్ ఈ సెట్‌ను డిజైన్ చేశారు. ఇక, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమా.. 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' లోని పలు సీన్స్ కూడా ఈ 'ధర్మస్థలి' సెట్లోనే షూట్ చేసినట్లు తెలుస్తోంది.