President polls 2022: జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలబెడదామనుకుంటున్న విపక్షాలకు మరో షాక్ తగిలింది. రాష్ట్రపతి రేసులో తాను నిలబడనని బంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ ప్రకటించారు. విపక్షాలు చేసిన వినతిని తిరస్కరించారు. అయితే తన పేరును ప్రతిపాదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి.. జాతీయ ఏకాభిప్రాయాన్ని కల్పించేలా, ప్రతిపక్షాల ఐక్యతను చాటేలా ఉండాలన్నారు. అలాంటి వ్యక్తికే అవకాశం ఇవ్వాలన్నారు. 77 ఏళ్ల గోపాలకృష్ణ గాంధీ.. మహాత్మా గాంధీ, సీ రాజగోపాలచారికి మనవడు. దక్షిణాఫ్రికా, శ్రీలంకకు భారత హైకమిషనర్‌గా కూడా సేవలందించారు.
రాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థి విషయమై గతవారమే విపక్షాలతో సమావేశం నిర్వహించారు బంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ. ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ పేరును ప్రతిపాదించారు. అయితే అందుకు ఆయన నిరాకరించారు. ఎన్నికల్లో పోటీ చేసినా గెలిచే అవకాశం లేదని గతంలోనే పవార్ స్పష్టం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దూల్లా కూడా తాను రేసులో ఉండనని ప్రకటించారు. దీంతో గోపాల కృష్ట పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆయన కూడా విముఖత వ్యక్తం చేయడం విపక్షాలను ఆయోమయంలో పడేలా చేసింది.