Gopalganj Co Operative Bank Manager Fraud : పని చేస్తున్న బ్యాంకుకే టోకరా వేశాడు బిహార్‌లోని గోపాల్‌గంజ్ సెంట్రల్ కో- ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్. ఖాతాదారుల అకౌంట్ల నుంచి సుమారు రూ.3 కోట్లు తన బంధువుల ఖాతాల్లోకి బదిలీ చేశాడు. దీంతో అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ విషయంలో మేనేజర్‌కు సహకరించిన మరో ఇద్దరిపైనా వేటు వేశారు. ఇప్పటి వరకు సుమారు రూ. 85 లక్షలు రికవరీ చేసినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే..
ఏడాది క్రితం రాంబలి ప్రసాద్ అనే వ్యక్తి ఫిక్స్డ్ డిపాజిట్ కోసం ధ్రువపత్రాలను బ్యాంకులో సమర్పించాడు. అప్పుడు బ్యాంకు మేనేజర్‌గా ఉన్న చౌదరి రామకాంత్.. ప్రసాద్ డ్యాకుమెంట్లతో అతని పేరు మీద లోన్‌ను మంజూరు చేశాడు. ఆ లోన్ డబ్బును తన బంధువుల ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. ఇలా ఏడాది వ్యవధిలోనే బ్యాంకు మేనేజర్.. ఐటీ అసిస్టెంట్ సంజయ్ యాదవ్, అసిస్టెంట్ సంజీవ్ కుమార్ సహాయంతో మొత్తం 67 అకౌంట్ల నుంచి సుమారు రూ.3 కోట్లను వారి సమీప బంధువులకు చెందిన 12 ఖాతాలకు బదిలీ చేసుకున్నాడు.
ఈ విషయం గురించి తెలుసుకున్న బ్యాంకు మేనేజ్మెంట్ బోర్డు.. నాబార్డుకు సమాచారం అందించింది. ఈ విషయంపై నాబార్డు.. దర్యాప్తు కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. విచారణలో బ్యాంకు మేనేజర్.. ఇతర ఉద్యోగులతో కలిసి సుమారు రూ.3 కోట్లను ఖాతాదారుల అకౌంట్ల నుంచి తన బంధువుల ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నట్లు తెలిసింది. దీంతో బ్యాంకు మేనేజర్ సహా ముగ్గురిని సస్పెండ్ చేశారు అధికారులు. అలానే వారి దగ్గర నుంచి రూ. 85 లక్షల వరకు రికవరీ చేసినట్లు సమాచారం. ఈ ఫ్రాడ్ గురించి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ నాబార్డుకు సమాచారం ఇచ్చారు. ఈ విషయంపై పట్నా నాబార్డు ప్రాంతీయ కార్యాలయం దర్యాప్తు జరుపుతోందని డీడీఎం అనుపమ్ లాల్ కుష్మాకర్ తెలిపారు.