తెలంగాణ

telangana

By

Published : Jan 19, 2022, 7:11 AM IST

ETV Bharat / bharat

Google Meet Wedding: పెళ్లి గూగుల్​ మీట్​లో.. జొమాటోలో విందు..!

Google Meet Wedding: పెళ్లంటే.. ఆకాశమంత పందిళ్లు.. చుట్టాల సందళ్లు.. విందు భోజనాలు..! ఇదంతా రెండేళ్ల క్రితం వరకు ఉన్న మాట. కరోనా పుణ్యమాని ఇప్పుడు పెళ్లిళ్లలో నయా ట్రెండ్‌ మొదలైంది. అదే 'ఆన్‌లైన్‌ వెడ్డింగ్‌'. మహమ్మారి భయాందోళనలు, కరోనా ఆంక్షల నేపథ్యంలో గతేడాది కొంత మంది వధూవరులు జూమ్‌ కాల్‌లోనే పెళ్లిపీటలెక్కడం లేదా.. తమ పెళ్లిని ఆన్‌లైన్‌ లైవ్‌లో ప్రసారం చేయడం వంటివి చేశారు. తాజాగా పశ్చిమ్​ బంగాకు చెందిన ఓ జంట మరో అడుగు ముందుకేసింది. ఆన్‌లైన్‌ వేదికగా 450 మంది అతిథులతో పెళ్లి వేడుకలకు సిద్ధమవుతోంది. అంతేనా.. ఆ అతిథులకు 'జొమాటో' తో విందు కూడా ఇవ్వనుంది..!

Google Meet Wedding
గూగుల్‌ మీట్‌లో పెళ్లంట

Google Meet Wedding: బంగాల్‌లోని బుర్ద్వాన్‌ ప్రాంతానికి చెందిన సందీపన్‌ సర్కార్‌, అదితి దాస్‌.. ఏడాది కాలంగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే కరోనా ఆంక్షల కారణంగా పలుమార్లు వీరు తమ వివాహాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. చివరకు ఈ ఏడాది జనవరి 24న పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ లోగానే ఒమిక్రాన్‌ రూపంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడటం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే వరుడు సందీపన్‌ కొవిడ్‌ బారినపడ్డారు. మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండి కోలుకున్నారు. మరోవైపు వైరస్‌ ఉద్ధృతితో బంగాల్​ ప్రభుత్వం కరోనా ఆంక్షలు విధించింది. వివాహాది శుభకార్యాల్లో అతిథులపై పరిమితి విధించింది. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో బంధువులందర్నీ పిలిచి పెళ్లి చేసుకోవడం సాధ్యం కాని పని. అలా అని మళ్లీ వివాహ తేదీని వాయిదా వేయలేని పరిస్థితి.

ఆ సమయంలోనే తమకు ఈ ఆన్‌లైన్‌ వెడ్డింగ్‌ ఆలోచన వచ్చిందని సందీపన్‌ తెలిపారు. 'జనవరి 2 నుంచి 4వ తేదీ వరకు కరోనా కారణంగా నేను ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. అప్పుడే నా కుటుంబం, మా పెళ్లికి వచ్చే అతిథుల గురించి ఆందోళన మొదలైంది. అందుకే, అందర్నీ పిలిచి కాకుండా మరో విధంగా పెళ్లి చేసుకోవాలని నేను నిశ్చయించుకున్నా. ఇదే విషయాన్ని అదితికి చెబితే తను కూడా అర్థం చేసుకుంది. అలా ఈ నెల 24న మేం ఆన్‌లైన్‌ వెడ్డింగ్‌ చేసుకోబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు, బంధువుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గూగుల్‌ మీట్‌లో మా పెళ్లి వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నాం' అని సందీపన్‌ చెప్పారు. ఇందుకోసం వీరు ఓ సాంకేతిక నిపుణుడిగా కూడా నియమించుకున్నారట. పెళ్లి తేదీకి ఒక రోజు ముందు అతిథులందరికీ గూగుల్‌ మీట్‌లో ఓ లైవ్‌ లింక్‌, పాస్‌వర్డ్‌ను పంపించనున్నారు. ఆ లింక్‌ ఓపెన్‌ చేసి.. బంధువులు తమ ఇళ్లల్లోనే ఉండి సురక్షితంగా వివాహాన్ని చూడొచ్చని సందీపన్‌ తెలిపారు.

అంతే కాదండోయ్‌.. మరి పెళ్లికి హాజరైన వాందరికీ విందు భోజనాలు పెట్టాలి కదా. దీనికీ ఈ జంట ఓ ఉపాయాన్ని ఆలోచించింది. జొమాటో యాప్‌ ద్వారా అతిథులందరికీ డిన్నర్‌ డెలివరీ చేసే ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై జొమాటో అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. 'ఇది చాలా వినూత్న ఆలోచన. ఇందుకోసం మేం ప్రత్యేకంగా ఓ బృందాన్ని కూడా నియమించాం. ఈ మహమ్మారి సమయంలో ఇలాంటి ఆలోచన చాలా బాగుంది. దీన్ని మా సోషల్‌మీడియాల్లోనూ ప్రచారం చేయాలనుకుంటున్నాం' అని తెలిపారు.

కరోనా దెబ్బకు ఈ మధ్య చాలా మంది ఇలాంటి వినూత్న వివాహ వేడుకలకే మొగ్గుచూపుతున్నారు. ఇటీవలే తమిళనాడుకు చెందిన ఓ జంట తమ వివాహ రిసెప్షన్‌ను మెటావర్స్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో జరిగే ఈ వేడుకకు బంధువులంతా డిజిటల్‌ అవతార్‌లో వర్చువల్‌గా రిసెప్షన్‌కు హాజరవుతారని వరుడు దినేశ్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details