Gold Smuggling In Surat : దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ. 25 కోట్లు విలువైన బంగారాన్ని పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన అధికారులు షాక్‌కు గురయ్యారు. దాదాపు 48 కిలోల బంగారాన్ని పేస్ట్ రూపంలోకి మార్చి, హ్యాండ్ బాగుల్లో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన అధికారులు.. నలుగురిని పట్టుకున్నారు. ఈ ఘటన జులై 7న జరగగా.. డీఆర్ఐ ఆదివారం ప్రకటన చేసింది.
ఇదీ జరిగింది
దుబాయ్- షార్జా నుంచి వస్తున్న ఎయిర్ఇండియా విమానంలో అక్రమ బంగారాన్ని తరలిస్తున్నారనే సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన డైరక్టరెట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజన్స్ అధికారులు.. వెంటనే సూరత్ విమానాశ్రయం చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే హ్యాండ్ బ్యాగ్‌లో తనిఖీ చేయగా.. పేస్ట్ రూపంలో బంగారం లభ్యమైంది. వెంటనే నలుగురిని శనివారం అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం అరెస్ట్ చేసి డీఆర్ఐ స్పెషల్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ బంగారం విలువ సుమారు రూ. 25 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీరిని సూరత్‌లోని రాందేర్కు చెందిన వారిగా గుర్తించారు. ఇప్పటివరకు పట్టుకున్న వాటిలో ఇదే అతిపెద్దదని అధికారులు చెప్పారు.
"ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ IX172 విమానంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్నారని సమాచారం అందింది. తనిఖీ చేయగా.. హ్యాండ్ బ్యాగ్‌లో 43.5 కిలోల పేస్ట్ రూపంలో ఉన్న బంగారం లభించింది. వీటిని బ్యాగులోని ఐదు బెల్టుల్లో 20 తెలుపు రంగు పాకెట్లలో పెట్టి తీసుకువచ్చారు. సూరత్ విమానాశ్రయంలో ఉన్న ఓ అధికారి సహకారంతో అక్రమ రవాణాకు ప్లాన్ చేశారు. ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్‌కు ముందు ఉన్న టాయిలెట్లో మార్చుకునేందుకు ప్లాన్ చేశారు. ఆ తర్వాత మరో 4.67 కిలోల పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని టాయిలెట్లో లభించింది. దీనిని సీఐఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకుని.. డీఆర్ఐకి అప్పగించింది."
--డీఆర్ఐ అధికారులు