Gold Smuggling Case Kerala: బంగారం స్మగ్లింగ్ కేసు నిందితురాలు స్వప్న సురేశ్ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వల్లే తాను ఈ స్మగ్లింగ్ చేయాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఎర్నాకుళంలోని కోర్టుకు హాజరైన ఆమె.. ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలను సమర్పించారు. అయితే ఆ వివరాలను గోప్యంగా ఉంచారు.
"2016లో సీఎం దుబాయ్ పర్యటన సందర్భంగా మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం శివశంకర్ నన్ను సంప్రదించారు. సీఎం త్రివేండ్రంలో బ్యాగ్ మర్చిపోయారని దానిని వీలైనంత త్వరగా దుబాయ్ చేర్చాలని చెప్పారు. ఈ క్రమంలో దుబాయ్ కాన్సులేట్‌లోని ఓ దౌత్య అధికారికి ఆ బ్యాగ్‌ను ఇచ్చాను. కానీ అక్కడ స్కానింగ్‌లో బ్యాగ్ నిండా డబ్బు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన తర్వాతే నేను ఈ బంగారం స్మగ్లింగ్‌లో భాగం కావాల్సి వచ్చింది. అంతేకాదు.. దుబాయ్ కాన్సులేట్ నుంచి సీఎం నివాసానికి ఓ బిర్యానీ చేసే పాత్రలో విలువైన లోహాలను తరలించారు."