తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ రాజకీయాల్లో 'గోల్డ్​' చిచ్చు.. ఎవరికి లాభం? - అమిత్​ షా విజయన్​

కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు ఇప్పుడు గోల్డ్​ స్మగ్లింగ్​ కేసు చుట్టూ తిరుగుతున్నాయి. సీఎం పినరయి విజయన్​ను ఇరుకున పెట్టేందుకు భాజపా.. ఈ కేసును అస్త్రంగా మలుచుకుంది. అదే సమయంలో భాజపాను ఎదుర్కొనేందుకు విజయన్​ తన మాటలకు పదునుపెట్టారు. అయితే ఇవన్నీ డ్రామాలని కాంగ్రెస్​ ఆరోపిస్తోంది. ప్రజలకు సమాధానాలు చెప్పాలని నిలదీస్తోంది. ఇంతకీ ఏంటీ బంగారం కుంభకోణం?

'Gold smuggling accused was pressurised to name Vijayan'
కేరళ రాజకీయాల్లో 'గోల్డ్​' చిచ్చు.. ఎవరికి లాభం?

By

Published : Mar 10, 2021, 3:03 PM IST

"30 కిలోల బంగారం... దాదాపు రూ.15 కోట్లు విలువ... ఇద్దరు హైప్రొఫైల్ నిందితులు... ముఖ్యమంత్రిపైనే అనుమానాలు"... సంక్షిప్తంగా కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు వివరాలివి. ఇప్పుడివే కేరళ శాసనసభ ఎన్నికల్లో కీలకాంశాలయ్యాయి. అధికార ఎల్​డీఎఫ్​ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టేలా విపక్షాలు ఈ గోల్డ్​ స్మగ్లింగ్​ కేసును అస్త్రంగా మలుచుకుంటున్నాయి. ఈ వ్యూహాన్ని ఎదుర్కొనేందుకు అధికార పక్షం శాయశక్తులా ప్రయత్నిస్తోంది.

ఏంటీ కేసు?

2020 జులైలో.. యూఏఈ నుంచి కేరళలోని ఆ దేశ రాయబార కార్యాలయానికి వచ్చిన కార్గోలో దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలైన స్వప్నా సురేశ్​ను కొన్ని రోజులకు అరెస్ట్​ చేశారు. అప్పటి నుంచి ఈ కేసు కీలక మలుపులు తిరుగుతూ వచ్చింది.

స్వప్నా సురేశ్​

తొలుత.. ఈ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలతో.. సీఎం పినరయి విజయన్​ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చూస్తున్న ఐటీశాఖ కార్యదర్శి శివశంకర్​ను ఆ బాధ్యతలను తప్పించారు. ఆయన్ను అధికారులు అనేకమార్లు విచారించారు. అరెస్టు చేశారు.

ఇదీ చూడండి:-'రాజకీయాలకు 'కస్టమ్స్​'ను వాడుకుంటున్నారు'

తాజాగా.. ఈ కేసు మరో అనూహ్య మలుపు తిరిగింది. బంగారం కుంభకోణంలో సీఎంకు ప్రత్యక్ష పాత్ర ఉందని కస్టమ్స్​ అధికారులు ప్రకటించారు. నిందితురాలు స్వప్నా సురేశ్​.. ఈ విషయాన్ని రహస్య వాంగ్మూలంలో వెల్లడించినట్టు హైకోర్టులో ఇటీవలే దాఖలు చేసిన అభియోగపత్రంలో పేర్కొన్నారు.

ఈ వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇది బయటపడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. కానీ కథ అక్కడితో ముగిసిపోలేదు. ఇది జరిగిన కొద్ది రోజులకే.. ఓ పోలీసు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. స్వప్నా సురేశ్​పై ప్రశ్నల వర్షం కురిపించి.. సీఎం పేరు చెప్పించేందుకు ఆమెపై ఒత్తిడి పెంచారని ఆరోపించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుటు ఆమె వ్యాఖ్యలు చేశారు. ఈడీ స్వప్నను ప్రశ్నించినప్పుడు తాను అక్కడే ఉన్నట్టు పేర్కొన్నారు. విచారణ మధ్యలో అధికారులకు ఏవో ఫోన్​కాల్స్​ వచ్చేవని.. ఆ సమయంలో వారు ప్రశ్నలు అడిగేవారు కాదని వివరించారు.

పినరయి X షా...

ఈ పరిణామాలు.. అధికార ఎల్​డీఎఫ్​- విపక్ష భాజపా మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధానికి దారి తీశాయి. పినరయి విజయన్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. గత వారం.. కేరళలో చేపట్టిన ఎన్నికల ర్యాలీ వేదికగా.. గోల్డ్​ స్మగ్లింగ్​ వ్యవహారంపై విజయన్​ను నిలదీశారు. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించి ఓ అనుమానాస్పద మృతిని షా ప్రస్తావించారు. దీనిపై సీఎం ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

తిరువనంతపురంలోని రామకృష్ణ ఆశ్రమంలో
కేరళ ర్యాలీలో షా అభివాదం
షా ర్యాలీకి తరలి వెళ్లిన కేరళవాసులు

షా ఆరోపణలను విజయన్​ దీటుగా తిప్పకొట్టారు. తిరువనంతపురం విమానాశ్రయం కేంద్రం చేతిలో ఉందని.. మరి భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత.. గోల్డ్​ స్మగ్లింగ్​కు అది 'హబ్​'గా ఎందుకు మారిందని ఎదురు ప్రశ్నించారు. దీనికి షా సమాధానం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. షా 'అనుమానాస్పద మృతి' వ్యాఖ్యలపైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు కేరళ సీఎం. "మతతత్వానికి షా పెట్టింది పేరు. కిడ్నాప్​, నకిలీ ఎన్​కౌంటర్ల వ్యవహారంలో జైలుకు వెళ్లింది ఆయనే" అని ఆరోపించారు.

ఇదీ చూడండి:-'ఇది కేరళ.. భాజపా రౌడీయిజం ఇక్కడ కుదరదు'

పినరయి విజయన్​ వ్యాఖ్యలను కేంద్రమంత్రి మురళీధరన్​ తప్పుబట్టారు. అనవసరమైన విషయాలను ప్రజల ముందుకు తీసుకొచ్చి.. అసలు సమస్యను తప్పుదారి పట్టిస్తున్నట్టు ఆరోపించారు. విజయన్​ అధికారంలోకి వచ్చిన తర్వాతే తిరువనంతపురం విమానాశ్రయం గోల్డ్​ స్మగ్లింగ్​కు హబ్​గా మారిందని మండిపడ్డారు. దీనికి అమిత్​ షాకు సంబంధం లేదని.. ప్రశ్నల నుంచి విజయన్​ తప్పించుకోవడం మానుకోవాలన్నారు.

'ఇదంతా డ్రామా...'

భాజపా- సీపీఎం నేతల మధ్య వాగ్వాదాన్ని డ్రామాగా అభివర్ణించింది కాంగ్రెస్​. విజయన్​- షా.. ఒకరిపై ఒకరు ప్రశ్నల వర్షం కురిపించుకుంటున్నారన్న కాంగ్రెస్​ నేత ఊమన్​ చాంది.. ప్రజలకు కావాల్సింది ప్రశ్నలు కాదని.. సమాధానాలని గుర్తుచేశారు.

అనుమానాస్పద మృతిపై షా లేవనెత్తిన ప్రశ్నలపైనా స్పందించారు కేపీసీసీ చీఫ్​ రామచంద్రన్​. నిజంగా అలాంటిది ఏదైనా జరిగితే.. బయటపెట్టాలని డిమాండ్​ చేశారు.

ఇలా కేరళ రాజకీయంలో ప్రధాన అంశంగా మారిన గోల్డ్​ స్మగ్లింగ్ కేసు.. శాసనసభ ఎన్నికల్లో ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మే 2నే తేలనుంది.

ఇదీ చూడండి:-కేరళ ఫలితాలను శాసించే 'సామాజిక లెక్క'లు

ABOUT THE AUTHOR

...view details