Gold exploration: బిహార్లోని జముయి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద బంగారం గని ఉందని భారత జియోలాజికల్ సర్వే తెల్చిన క్రమంలో దానిపై దృష్టి సారించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. బంగారం వెలికితీసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టిందని, మైనింగ్ చేసేందుకు అనుమతులు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ) జముయి జిల్లాలో సర్వే నిర్వహించింది. దీని ప్రకారం జిల్లాలో 222.88 మిలియన్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని తేల్చింది.
"జముయి జిల్లాలోని బంగారం నిల్వలను వెలికి తీసేందుకు.. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ, జీఎస్ఐతో పాటు మైనింగ్ సంస్థలతో బిహార్ మైన్స్, జియోలజీ విభాగం చర్చలు జరుపుతోంది. జిల్లాలోని కర్మాటియా, ఝాఝా, సోనో వంటి ప్రాంతంలో బంగారం నిల్వలు ఉన్నాయన్న జీఎస్ఐ సర్వేపై సమాలోచనలు చేసిన తర్వాతే చర్చల ప్రక్రియ మొదలైంది. నెల రోజుల్లో జీ3 స్టేజ్ మైనింగ్ కోసం కేంద్ర ఏజెన్సీలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. కొన్ని ప్రాంతాల్లో జీ2 సాధారణ అనుమతులు సైతం ఇవ్వనుంది."