ప్రస్తుతం కరోనా బారిన పడివారు, యాంటీజెన్, ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్‌గా వచ్చిన వారు భయంతో సిటీస్కాన్ చేయించుకుంటున్నారు. సిటీస్కాన్ వల్ల మంచి కంటే దుష్ప్రభావాలే ఎక్కువని ఎయిమ్స్ చీఫ్ డా.రణదీప్ గులేరియా హెచ్చరించారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడేవారికి సిటీస్కాన్ అక్కర్లేదని స్పష్టం చేశారు. కొవిడ్ పాజిటివ్‌గా వచ్చిన వారు సిటీస్కాన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు.
"ఒక సిటీస్కాన్ 300 నుంచి 400 చెస్ట్ ఎక్స్‌రేలతో సమానం. తరచూ సిటీస్కాన్ చేయడం వల్ల యువత క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ శరీరం రేడియేషన్‌కు గురికావడం వల్ల అంతర్గతంగా దెబ్బతింటుంది. దయచేసి స్వల్ప కొవిడ్ లక్షణాలు ఉండి, సాధారణ ఆక్సిజన్ స్థాయిలు ఉన్నవారు సిటీస్కాన్ చేయించుకోవద్దు"
-రణదీప్ గులేరియా, ఎయిమ్స్ డైరెక్టర్
కేవలం ఆస్పత్రిలో చికిత్స పొందేవారు మాత్రమే, అది కూడా వైద్యుల సూచనల మేరకే సిటీ స్కాన్ చేయించుకోవాలన్నారు రణదీప్ గులేరియా. అయితే.. అంతకుముందు చెస్ట్ ఎక్స్‌రేకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. స్వల్ప లక్షణాలతో పాటు, అసలు లక్షణాలు లేని వారు కూడా సిటీస్కాన్ చేయించుకుంటున్నట్లు ఇటీవల గణాంకాలు చెబుతున్న నేపథ్యంలో గులేరియా ఈ హెచ్చరిక చేశారు.