Goddess Durga Dashavatar Idol : పురాతన దుర్గామాత విగ్రహాలు చాలా అరుదుగా దర్శనమిస్తాయి. అలాంటిది దశావతారంలో ఉన్న దుర్గామాత విగ్రహం అంటే అది ఇంకా అరుదైన విషయం. 16వ శతాబ్దంలో చెక్కిన ఆ ఏకశిలా విగ్రహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. మహారాష్ట్రలోని చంద్రాపుర్లో 18 అడుగుల వెడల్పు, 23 అడుగుల పొడవున్న ఆ భారీ విగ్రహాన్ని స్థానికులు రాళ్లతో కొట్టే వారు. అయితే కొన్నేళ్ల తర్వాత నిజం తెలుసుకుని అలా చేయడం ఆపేశారు.
దుర్గామాత విగ్రహాన్ని రాళ్లతో కొట్టేవారు!
నగరంలోని భివాపుర్ వార్డులో ఉన్న రాజీవ్ గాంధీ ఇంజినీరింగ్ కాలేజీ వెనకాల ఉన్న స్థలంలో దుర్గాదేవి విగ్రహంతో పాటు కొన్ని విగ్రహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ దీన్ని రావణ ప్రాంతంగా పిలుస్తారు. రాతి విగ్రహానికి పది తలలు ఉండటం చూసిన స్థానికులు రావణుడి విగ్రహంగా భావించారు. దీంతో దసరా రోజున ఇక్కడ గుమిగూడి రాళ్లు విసిరేవారు. అయితే కాలక్రమేనా అది రావణుడి విగ్రహం కాదని దుర్గామాత విగ్రం అని తెలుసుకున్న స్థానికులు.. అప్పటినుంచి రాళ్లతో కొట్టడం ఆపేశారు.
ఆలయం నిర్మించబోయి.. హఠాన్మరణం!
16వ శతాబ్దంలో చంద్రపుర్ ప్రాంతాన్ని ధుంద్య రాంషాహ అనే గోండు రాజు పాలించేవాడు. ఈ రాజ్యంలో రాయప్ప వైశ్య అనే ధనవంతుడు ఉండేవాడు. అతడు మహా శివ భక్తుడు. దీంతో భోలాశంకరుడికి ఆలయం నిర్మించాలని సంకల్పించి పనులు మొదలుపెట్టాడు. రాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి శిల్పులను పిలిపించి దశముఖి దుర్గ, మహిషాసురమర్దిని, మత్సావతారం, కూర్మావతారం, శివలింగం, నంది, హనుమంతుడు, గణేషుడు, కాలభైరవుడు, శేషనాగు, గరుడ వంటి ఏక శిల విగ్రహాలను తయారు చేయించాడు. అయితే విగ్రహాల పని పూర్తయ్యాక రాయప్ప హఠాత్తుగా చనిపోయాడు. ఆయన మరణం తర్వాత ఆలయ నిర్మాణ పనులపై రాయప్ప కుటుంబ సభ్యులెవరూ ఆసక్తి చూపలేదు. దీంతో ఇప్పటికీ ఆ విగ్రహాలు అలాగే మట్టిలో కూరుకుపోయి ఉన్నాయి.