GOA LIBERATION PM MODI: గోవాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. అప్పట్లో నెహ్రూ తల్చుకొని ఉంటే గోవాను భారత్లో విలీనం చేసుకునేందుకు కొన్ని గంటల సమయమే పట్టేదని అన్నారు. కానీ, పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి లభించడానికి 15 ఏళ్లు పట్టిందని పేర్కొన్నారు.
Goa liberation Nehru Modi
మపుసా ప్రాంతంలో నిర్వహించిన సభలో పాల్గొన్న మోదీ.. గోవాను కాంగ్రెస్ పార్టీ తన శత్రువులా భావిస్తోందని ధ్వజమెత్తారు. అందుకే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని సృష్టిస్తోందని ఆరోపించారు.
"గోవా సంస్కృతి, ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. గోవా పట్ల కాంగ్రెస్ శత్రుత్వమే ఉంది. చారిత్రకంగా రెండు వాస్తవాలను దేశ ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. రెండు రోజుల క్రితం ఆ వాస్తవాల గురించి, గోవా విముక్తి ఉద్యమాన్ని ఎలా కాంగ్రెస్ అణచివేసిందో అనే వివరాల గురించి నేను పార్లమెంట్లో మాట్లాడాను. స్వాతంత్ర్యం వచ్చిన 15 ఏళ్ల తర్వాత భారత్లో గోవా విలీనమైందని చాలా మందికి ఇప్పటికీ తెలీదు. అప్పుడు మనకు సైనిక శక్తి ఉంది. బలమైన నావికా దళం ఉంది. కొన్ని గంటల్లోనే ఆ పని(పోర్చుగీసు పాలన నుంచి గోవాకు విముక్తి) పూర్తయ్యేది. కానీ, అందుకు కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ల వరకు ఏమీ చేయలేకపోయింది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
గోవా విముక్తి ఉద్యమంలో పోరాడిన ప్రజలను కాంగ్రెస్ పట్టించుకోలేదని మోదీ ధ్వజమెత్తారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించలేదని మండిపడ్డారు. 'గోవాకు సైన్యాన్ని పంపించేది లేదని నెహ్రూ స్వయంగా ఎర్ర కోట ప్రసంగంలో చెప్పారు. గోవా పట్ల ఇలాగేనా వ్యవహరించేది? గోవాపై కాంగ్రెస్కు అప్పుడే కాదు ఇప్పటికీ అదే ఆలోచనా ధోరణి ఉంది' అని మోదీ తీవ్రంగా మండిపడ్డారు.
ఇదీ చదవండి:'అల్లర్లు వద్దనుకుంటే భాజపా అధికారంలోనే ఉండాలి'