ఉక్కు సంకల్పం, ఆత్మవిశ్వాసానికి నిలువుటద్దంలా నిలుస్తున్నారు గోవాకు చెందిన ఓ ఐపీఎస్ అధికారి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, క్యాన్సర్ మహమ్మారి కబలించేందుకు ప్రయత్నించినా.. తన పోరాట పటిమతో జీవిత యుద్ధాన్ని గెలిచారు. అత్యంత కఠినమైన పరుగుపందెంగా భావించే 'ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్ రేసు'ను పూర్తి చేసి అందరి మనసులు దోచుకున్నారు.
గోవాకు చెందిన నిధిన్ వాల్సన్(36) 2012 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా పనిచేస్తున్నారు. గోవాలో చర్చనీయాంశంగా మారిన ల్యాండ్ కబ్జా కేసును ఈయనే విచారిస్తున్నారు. గతేడాది ఈయనకు నాన్-హాడ్కిన్ లింఫోమా అనే వ్యాధి వచ్చింది. ఇది రక్తనాళాలకు వచ్చే క్యాన్సర్. అయితే, ఈ రోగం వచ్చిందని వాల్సన్ ఎప్పుడూ కుంగిపోలేదు. సరైన వైద్యం తీసుకుంటూ.. క్యాన్సర్‌పై పోరాడారు. వ్యాధిపై మానసికంగా యుద్ధం చేశారు. దీంతో భయంకర క్యాన్సర్ తలొగ్గింది. వాల్సన్ పట్టుదల ముందు సాగిలపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయనకు క్యాన్సర్ పూర్తిగా నయమైంది. ఇప్పుడు తన ఆరోగ్యం బాగానే ఉందని వాల్సన్ చెబుతున్నారు.
రేసు పూర్తి చేసిన నిధిన్ వాల్సన్ ఈ క్రమంలోనే పనాజీలో ఆదివారం నిర్వహించిన ఐరన్‌మ్యాన్ రేసులో పాల్గొన్నారు వాల్సన్. స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్ పోటీలు కలిపి ఉండే రేసు ఇది. చాలా ఫిట్‌గా ఉంటే తప్ప దీన్ని పూర్తి చేయడం కష్టం. అలాంటిది వాల్సన్.. 8 గంటల 3 నిమిషాల 53 సెకన్లలో రేసును పూర్తి చేశారు. పోటీలో తొలి స్థానంలో నిలవకపోయినా.. రేసును విజయవంతంగా పూర్తి చేసి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. "క్యాన్సర్ అనేది జయించలేని వ్యాధి కాదు. ఈ రేసు పూర్తి చేయడం ద్వారా ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పవచ్చని భావించా. క్యాన్సర్ వచ్చిందని తెలియగానే.. దానిపై పోరాడా. ఎప్పుడూ నిరాశపడలేదు" అని వాల్సన్ చెప్పుకొచ్చారు.
ఐపీఎస్ అధికారి నిధిన్ వాల్సన్ ఈ ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్ రేసులో 1,450 మంది పాల్గొన్నారు. రేసులో భాగంగా 1.9 కిలోమీటర్ల మేర సముద్రంలో ఈత కొట్టాలి. 90 కిలోమీటర్లు సైక్లింగ్ చేయాలి. 21 కిలోమీటర్లు పరుగెత్తాలి. ఐఐటీ బాంబే అలుమ్నీ నిహాల్ బైగ్ ఈ రేసులో విజయం సాధించారు. డిఫెండింగ్ ఛాంపియన్, భారత ఆర్మీలో పనిచేస్తున్న బిస్వోర్జిత్ సైఖోమ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు.